విద్యానగర్: చట్టసభల్లో బిసిలకు 50శాతం సీట్లు కేటాయించడంతో పాటు కులాల వారీగా జనగణన చేపట్టాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపి, ఆర్ .కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలహీనవర్గాల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో 16వ తేదిన విశాఖపట్టణంలో తలపెట్టిన బిసి మహా గర్జనను విజయవంతం చేయాలన్నారు. బిసి మహా గర్జనకు సంబందించిన ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ ఆదివారం విద్యానగర్ లోని బిసి భవన్ లో జరిగింది.ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతు జనగణనలో భాగంగా కుల గణన జరపాలని ఎనిమిదికి పైగా రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసినా కేంద్రం స్పందించకపోవడం దారుణ మన్నారు.
చట్టసభల్లో సగం వాటా ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా క్రిమీలేయర్ ను ఎత్తివేయాలని కోరారు.ముఖ్యంగా జనాభాలో సగభాగమున్న బడుగులకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ లేకపోవడం ఎంత వరకు సమంజసమని కృష్ణయ్య ప్రశ్నించారు. బిసి లకు ప్రస్తుతమున్న 27 శాతం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచి, సామాజిక భద్రత కోసం బిసి యాక్ట్ ను అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 6 లక్షల ఉద్యోగాల భర్తీకోసం వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి, 2లక్షల కోట్లతో బిసి సబ్ ప్లాన్ రూపొందించాలన్నారు. అంతే కాకుండా న్యాయమూర్తుల నియామకాల లోనూ బిసిలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. బడుగుల సమస్యల సాధన, సంఘటితం కోసం 16 వ తేదిన విశాఖ పట్నంలో నిర్వహించనున్న బిసి మహ గర్జనకు పెద్దసంఖ్యలో బిసిలు తరలి రావాలని కోరారు సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ అదికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్, వేముల రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్, గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.