Friday, January 10, 2025

ఆజం ఖాన్ కుటుంబానికి షాక్.. ముగ్గురూ మూడు జైళ్లకు

- Advertisement -
- Advertisement -

ఎన్‌కౌంటర్ కావచ్చేమో : ఆజంఖాన్ వ్యాఖ్య
లక్నో : రెండు జనన ధ్రువీకరణ పత్రాల కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంను జైలు అధికారులు రాంపూర్ జైలు నుంచి ఆదివారం తరలించారు. ఆజంఖాన్‌ను సీతాపూర్ జైలుకు, అబ్దుల్లాను హర్దోయ్ జైలుకు తరలించారు. విచారణ అనంతరం ఇద్దరిని వేర్వేరు ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఇదే కేసులో ఆజంఖాన్ భార్య రాంపూర్ జైలులోనే ఉండనున్నారు.

బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులో ఆజం ఖాన్, ఆయన భార్య తజిన్ ఫాత్కా, తనయుడు అబ్దుల్లాకు ఎంపీఎల్‌ఎ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అలాగే రూ. 50 వేల జరిమానా కూడా విధిస్తూ ముగ్గురిని జైలుకు తరలించాలని ఆదేశించింది. ఆ తర్వాత పోలీస్‌లు ముగ్గురిని అదుపు లోకి తీసుకుని రాంపూర్ జైలుకు తరలించారు. శనివారం రాత్రి ఆజం, అబ్దుల్లాను రాంపూర్ జైలుకు తరలించాలని పోలీస్‌లకు ఆదేశాలు వచ్చాయని , ఈమేరకు ఆజం ఖాన్‌ను సీతాపూర్, అబ్దుల్లా ఆజమ్‌ను హార్గోయ్ జైలుకు తరలించినట్టు ఎస్పీ రాజేశ్ ద్వివేది తెలిపారు. ఆజం భార్య తజిన్ ఫాత్మాను రాంపూర్ లోనే ఉంచినట్టు తెలిపారు.

ఈ క్రమం లోనే తమను ఎన్‌కౌంటర్ చేస్తారేమో … ఏదైనా జరగవచ్చు అంటూ ఆజంఖాన్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వేరే జైలుకు తరలించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ భద్రత మధ్య ఇద్దరు నేతలను పోలీస్‌లు వేర్వేరు జైళ్లకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. రాంపూర్ జైలు నుంచి బయటకు తీసుకు వచ్చిన సమయంలో ఆజంఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌కౌంటర్ చేయొచ్చునేమో … నాకు , నా కుమారుడికి ఏమైనా జరగొచ్చు. అని అక్కడ ఉన్న రిపోర్టర్లతో పేర్కొన్నారు. సీతాపూర్ జైలుకు తీసుకెళ్తున్న సమయంలో వాహనం వెనుక సీట్లో కూర్చోవాలని ఆజం ఖాన్‌ను పోలీస్‌లు అడిగారు. అందుకు నిరాకరించిన ఆయన వెన్నునొప్పి కారణంగా మధ్యలో కూర్చోలేనని, కిటికీ ఉన్న సీట్లో కూర్చుంటానని చెప్పడం వినిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News