ఇజ్రాయెల్‌పై శనివారం నాటి హమాస్ దాడి మొత్తం ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. దుర్భేద్య దుర్గాన్నని చెప్పుకొనే ఇజ్రాయెల్ ధీమాకు తూట్లు పడ్డాయి. హమాస్ దాడిలో వందలాది మంది ఇజ్రాయెలీలు దుర్మరణం పాలయ్యారు. ఒక్కసారిగా యుద్ధ సైరెన్లతో 5000 రాకెట్లు ప్రయోగించి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళిన హమాస్ మిలిటెంట్ల తెగువ ఆశ్చర్యపరిచింది. చొరబడిన 1500 మంది మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ చెప్పుకొన్నది. పాలస్తీనా అంటే ఒంటికాలిపై లేచే ప్రధాని నెతన్యాహు ఇక యుద్ధమే అని ప్రకటించాడు. అసంఖ్యాక ఇజ్రాయెలీ సేనలు గాజా మీద విరుచుకుపడుతున్నాయని మంగళవారం నాటి వార్తలు తెలియజేశాయి. ఇప్పటికే ఆ ప్రాంతానికి కరెంటు, నీరు, ఇంధన సరఫరాలను ఆపివేసిన ఇజ్రాయెల్ అక్కడి భవనాలను కుప్పకూలుస్తున్నది. తగిన సౌకర్యాలు లేక సతమతమవుతున్న గాజా ఆసుపత్రులు ఈ విషమ స్థితిని ఎదుర్కోడం కష్టం.
గాజాలో 20 నుంచి 30 లక్షల మంది పాలస్తీనియన్లు వుంటారు. ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తే తమ వద్ద బందీలుగా వున్న ఇజ్రాయెలీలను హతమారుస్తామని హమాస్ ప్రకటించింది. అదే సమయంలో ఇజ్రాయెల్ గనుక తన వద్ద గల హమాస్ బందీలను విడుదల చేస్తే అందుకు ప్రతిగా తమ వద్ద నున్న ఇజ్రాయెలీలను కూడా విడిచిపెడతామని హమాస్ రాయబారాలు చేస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఖతార్ ద్వారా ఇజ్రాయెల్‌ను మెత్తబరచడానికి అది ప్రయత్నిస్తున్నది. హమాస్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య ఈ దాడులు, ప్రతిదాడులు కొత్త కాదు. అయితే వీటికి అటు ఇటు సాధారణ పౌరులు బలి కావడమే ఆందోళనకరం. ఇది మానవాళి శాంతి కాముకత మీద మాయని మచ్చ. ఇజ్రాయెల్‌ను ప్రోత్సహిస్తున్న అమెరికా ధోరణిలో సానుకూలమైన, సమూలమైన మార్పు రానంత వరకు ఈ రక్తపాతం ఇలాగే కొనసాగుతుంది. ఈసారి హమాస్ చేసిన దుస్సాహసం 1973లో ఇజ్రాయెల్ ఒకవైపు, ఈజిప్టు, సిరియా మరోవైపు వుండి సాగించిన యోమ్ కిప్పూర్ యుద్ధాన్ని చేస్తున్నదని పోలుస్తున్నారు. యోమ్ కిప్పూర్ యుద్ధంలో 2500 మందికి పైగా ఇజ్రాయెలీ సైనికులు మరణించారు. అప్పుడు కూడా ఈజిప్టు సిరియాలు మెరుపు దాడికి పాల్పడ్డాయి.
ఇజ్రాయెల్ తేరుకోడానికి కొంత సమయం పట్టింది. ప్రస్తుత హమాస్ దాడి, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులపై ప్రపంచం ఎప్పటిలాగానే రెండుగా చీలిపోయింది. ముందుగా దాడి చేసిన హమాస్‌నే అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చిరకాలం పాటు పాలస్తీనాకు అండగా నిలిచిన ఇండియా కూడా ఈసారి ఇజ్రాయెల్ వైపే మొగ్గింది. ప్రధాని మోడీ దానిని గట్టిగా సమర్థించి మద్దతు తెలిపారు. మోడీతో నెతన్యాహూ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఇరాన్, దాని మద్దతు తీసుకొంటున్న హెజ్‌బుల్లా తీవ్రవాద సంస్థ మాత్రం హమాస్‌కు మద్దతు తెలిపాయి. ఈ దాడులు, ప్రతిదాడుల ప్రస్తావన చేయకుండా చైనా పాలస్తీనా స్వాతంత్య్రానికి పిలుపునిచ్చింది. స్వతంత్ర పాలస్తీనా అవసరాన్ని గురించి నొక్కి చెబుతూ చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య దౌత్యం నెరపి వాటిని కలిపిన చైనా ఈసారెందుకో జాగ్రత్తగా అడుగులు వేసింది.
అమెరికా స్థానంలో అంతర్జాతీయ వివాదాల పరిష్కర్త పాత్ర వహించాలన్న ఉత్సుకత చైనాలో వున్న మాట వాస్తవం. కాని ప్రస్తుతం అది నిగ్రహం పాటించడం విశేషం. అమెరికా విధాన వైఫల్యం వల్లనే ఇజ్రాయెల్, హమాస్ మధ్య తాజా ఘర్షణ సంభవించిందని రష్యా ఆరోపించింది. హమాస్ దుందుడుకు చర్యను ఖండించి తీరవలసిందే. ఇజ్రాయెల్ బలం ముందు తనకు అంత శక్తి లేదనే విషయం తెలిసి కూడా అది ఎందుకు ఈ దాడులకు పాల్పడింది అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. కాని ఇజ్రాయెల్ కక్ష సాధింపు దాడులకు చిరకాలంగా పాలస్తీనా పడుతున్న బాధలు తెలిసిన వారు హమాస్ తెగింపును ఏకపక్ష దుస్సాహస చర్యగా మాత్రం పరిగణించలేరు. యాసిర్ ఆరాఫత్ బతికి వున్నంత కాలం పాలస్తీనా తరపున ఓపికగా ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతూ వచ్చారు.
హమాస్ అందుకు భిన్నమైన శక్తి. ఇజ్రాయెల్ తనకు ఎదురు లేదని, అడిగేవారు లేరనే ధీమాతో పాలస్తీనాపై అదే పనిగా ఉక్కు పాదం మోపుతున్న వాస్తవాన్ని గమనించకుండా హమాస్‌ను కేవలం ఉగ్రవాద సంస్థగానే భావించలేము. అణచివేస్తున్న, దానికి గురవుతున్న శక్తుల మధ్య ఘర్షణలో అణగారిన వారి వైపు వుండడం మానవ ధర్మం. ఇప్పటికైనా అమెరికా తన వైఖరిని సవరించుకొని పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు గట్టి కృషి చేయాలి. అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు చేరువ అవుతున్నంత మాత్రాన పాలస్తీనా ఎల్లకాలం చైతన్య రహితంగా పడి వుండదనే సంగతి ఇప్పటి హమాస్ దాడితో మరింత స్పష్టంగా వెల్లడైంది. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం దుష్ప్రభావాన్ని చవిచూస్తున్న ప్రపంచం ఈ పరిణామాలతో మరిన్ని సమస్యలను ఎదుర్కోనున్నది.