Wednesday, January 22, 2025

ఇజ్రాయెల్ దళాలపై హమాస్ మారణ కాండ

- Advertisement -
- Advertisement -

21 మంది సైనికులు హతం
గాజాలో యుద్ధం ప్రారంభమైన తరువాత ఒకే దాడిలో దుర్ఘటన
కాల్పుల విరమణ యత్నాలకు విఘాతం

జెరూసలెం : గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దళాలపై హమాస్ మంగళవారం జరిపిన దాడిలో 21 మంది సైనికులు హతులయ్యారని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. అక్టోబర్ 7న హమాస్ దాడితో యుద్ధం మొదలైన తరువాత ఒక్క రోజులో అంత అధిక సంఖ్యలో సైనికులు మరణించడం ఇదే మొదటిసారి. రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణ కోసం అభ్యర్థనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి విఘాతం కలిగించే అవకాశం ఉన్నది. కొన్ని గంటల తరువాత గాజా దక్షిణ ప్రాంతంలో రెండవ పెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌ను తమ సాయుధ దళాలు చుట్టుముట్టాయని మిలిటరీ ప్రకటించింది.

ఆ ప్రాంతంలో ఇటీవలి కాలంలో భారీ యుద్ధంలో డజన్ల కొద్దీ పాలస్తీనియన్లు మరణించారని, గాయపడ్డారని మిలిటరీ తెలియజేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైనికుల మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. హమాస్‌పై ‘సంపూర్ణ విజయం’ సాధించేంత వరకు తాము దాడులు కొనసాగిస్తామని నెతన్యాహు శపథం చేశారు. గాజాలో బందీలుగా ఉన్న 100 మందిని తిప్పి పంపిస్తామని ఆయన వాగ్దానం చేశారు. అయితే, అలా చేయడం సాధ్యమేనా అనే విషయమై ఇజ్రాయెలీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధిక సంఖ్యలో ఇజ్రాయెలీల మరణాల వల్ల సైనిక చర్యలను సగానికి కుదించేలా ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది.

ఇది ఇలా ఉండగా, రెండు నెలల పాటు కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ప్రతిపాదించిందని, ఆ సమయంలో ఇజ్రాయెల్ నిర్బంధించిన పాలస్తీనియన్ల విడుదలకు బదులుగా బందీలకు స్వేచ్ఛ ప్రసాదిస్తారని, గాజాలోని అగ్ర శ్రేణి హమాస్ నేతలు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు అనుమతిస్తారని ఈజిప్ట్ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. మీడియాకు వివరించేందుకు అనుమతి లేని, పేరు వెల్లడించరాన్న షరతుపై మాట్లాడిన ఆ అధికారి ఆ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించిందని, ఇజ్రాయెల్ తమ దాడిని ముగించి, గాజా నుంచి ఉపసంహరించుకునేంత వరకు బందీలను ఇక విడుదల చేసేది లేదని స్పష్టం చేసిందని వివరించారు.

కాగా, చర్చలపై వ్యాఖ్యానించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నిరాకరించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య గతంలో ఒప్పందాలకు సంప్రదింపులు జరిపిన ఈజిప్ట్, ఖతార్ ఆ రెండు పక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు బహుళ దశల ప్రతిపాదనను రూపొందిస్తున్నాయని ఆ అధికారి తెలిపారు. హమాస్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవలసిందిగా బందీల కుటుంబాలు ఇజ్రాయెల్‌ను కోరుతున్నారు. బందీలను సజీవంగా తీసుకువచ్చేందుకు సమయం ఉండకపోవచ్చునని వారు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News