Sunday, December 22, 2024

టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌తో పోరాటం సాగిస్తున్న హమాస్ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా (62) బుధవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన ఇంటివద్ద వైమానికి దాడిలో హత్యకు గురయ్యాడు. ఈ దాడిలో ఆయన బాడీగార్డు కూడా మృతి చెందాడు. ఇరాన్ ప్రభుత్వం, మిలిటెంట్ గ్రూప్ ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ హత్యకు ఎవరూ బాధ్యత వహించనప్పటికీ ఇజ్రాయెల్ ఈ హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన వెలువడలేదు. టెహ్రాన్‌లో మంగళవారం ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హనియా హాజరై ఇంటికి వచ్చిన తరువాతనే ఈ దాడి జరిగింది. ఈ హత్యపై దర్యాప్తు ప్రారంభమైంది. ఇజ్రాయెల్‌హమాస్ పోరును నివారించడానికి అమెరికా తదితర దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలకు ఈ సంఘటనతో ప్రతిష్ఠంభన ఏర్పడడమే కాక, మరిన్ని ఉద్రిక్తతలు పెరుగుతాయని ఇరాన్ పాలక వర్గాలు పేర్కొంటున్నాయి.

బదులు తప్పదు : హమాస్
ఈ కుట్రకు బదులు తప్పదు. ఇది పూర్తిగా కుట్రపూరిత చర్య అని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ముసా అబుమర్జుక్ ఇజ్రాయెల్‌పై ప్రతీకార హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడి లోనే తమ చీఫ్ మృతి చెందాడని హమాస్ ఆరోపించింది. పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ హత్యపై వాఖ్యానించేందుకు అమెరికా శ్వేతభవనం అధికార ప్రతినిధి నిరాకరించారు. హనియా హత్య హమాస్‌ను రెచ్చగొట్టింది. గత పదినెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్‌హమాస్‌యుద్ధం నిలుపుదలకు , బందీల విడుదలకు సాగుతున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని అమెరికా మధ్యవర్తులు ఇప్పటివరకు చెబుతున్నారు.

అయితే ఇస్మాయిల్ హనియా హత్యతో ఆ సంధి ప్రయత్నాల నుంచి హమాస్ వైదొలిగేలా పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ ప్రముఖులను హత్య చేయడమే ఏడాది పొడుగునా టార్గెట్‌గా ఇజ్రాయెల్ పెట్టుకున్నట్టు అనుమానాలు ఉంటున్నాయి. ఇందులో భాగంగా ఇరాన్ అణుశాస్త్రవేత్తలను, అణు ప్రయోగ సంబంధిత ప్రముఖులను హతమార్చాలని చూస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. 2020లో ఇరాన్ మిలిటరీ న్యూక్లియర్ సైంటిస్టు మొహిసెన్ ఫక్రిజడేహ్ హత్యకు గురయ్యారు. టెహ్రాన్ బయట కారులో ఆయన ప్రయాణిస్తుండగా, రిమోట్ కంట్రోల్ మెషిన్‌గన్‌తో కాల్చి చంపారు. హమాస్‌పై గత అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ సాగిస్తున్న పోరులో చెందిన 39.360 మంది పాలస్తీనియన్లు హతులయ్యారు. 90,900 మంది గాయపడ్డారు.

ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం : ఆయతొల్లా అలి ఖమైనీ
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం నేత ఆయతొల్లా అలి ఖమైనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. హనియా ప్రతీకారమే తమ విధిగా ఆయతొల్లా స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తనకు తానే కఠినమైన శిక్షకు సిద్ధమైందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News