Friday, November 15, 2024

వందల రాకెట్లతో విరుచుకుపడ్డ హమాస్

- Advertisement -
- Advertisement -

Hamas cracked down with hundreds of rockets

ఐరన్‌డోమ్‌తో పేల్చేసిన ఇజ్రాయెల్
పాలస్తీనా నగరాలపై వైమానిక దాడులు
54కు చేరిన మృతులు, వందలాది క్షతగాత్రులు

జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పోరు భీకర రూపం తీసుకుంటోంది. బుధవారం ఉదయం ఈ రెండు దేశాల మధ్య మరోసారి పరస్పర దాడులు జరిగాయి. రెండు రోజుల దాడుల్లో మృతుల సంఖ్య 54కు చేరుకోగా, వందలాదిమంది గాయపడ్డారు. పాలస్తీనాలోని హమాస్ దళాలు, ఇతర మిలిటెంట్ బృందాలతో కలిసి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, బీర్‌షెబా నగరాలపైకి వందలాది రాకెట్లను ప్రయోగించాయి. అయితే, ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ దాదాపు 90 శాతం రాకెట్లను కూల్చివేసింది. అంతేగాక ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ విమానాలు మరోసారి గాజాపై విరుచుకుపడ్డాయి. అపార్ట్‌మెంట్లతో కూడిన రెండు టవర్లను కూల్చివేశాయి. బుధవారం ఖాన్‌యూనిస్ పట్టణంపైనా వైమానిక దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ తీవ్రవాదులే లక్షంగా దాడులు జరిపామని తెలిపింది. గాజాపై మంగళవారం జరిపిన దాడిలో 13 అంతస్థుల హనాదీ టవర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. తమ దాడుల్లో కూలిన భవనాలన్నీ హమాస్ స్థావరాలేనని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఈ పరస్పర దాడుల్లో ఇప్పటివరకు పాలస్తీనా పట్టణం గాజాలో 48మంది చనిపోగా,వారిలో 14మంది చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారని ఆ దేశ ఆరోగ్యశాఖమంత్రి తెలిపారు. 300మందికిపైగా గాయపడ్డారని, వారిలో 86మంది చిన్నారులు, 39మంది మహిళలున్నారని ఆయన తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో ఆరుగురు చనిపోయారు. వారిలో ఒక సైనికుడు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. పాలస్తీనా మృతుల్లో హమాస్ స్పెషల్ రాకెట్ గ్రూప్ అధిపతి సమాహ్ అబెద్ అల్ మామ్‌లౌక్, యాంటీ ట్యాంక్ మిస్సైల్ కమాండర్ ఉన్నారు. 2014 తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఇంత భీకర దాడులు జరగలేదని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా ఇజ్రాయెల్‌కు పేరున్నది. దాంతో, సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయంగా విజ్ఞప్తులందుతున్నాయి. 2014 దాడుల విషయంలోనూ ఇజ్రాయెల్‌పై విమర్శలొచ్చాయి. తీవ్రవాదుల ఏరివేతలో భాగంగా అమాయకులు బలి కాకుండా చూడాలని అంతర్జాతీయ సంస్థలు సూచించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News