Monday, December 23, 2024

మోసాద్ నిఘా కళ్లు కప్పి హమాస్ పులి పంజా

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : నిద్రాణంగా ఉన్న హమాస్ నుంచి అత్యంత భీకర , బహుముఖ స్థాయి ఆకస్మిక దాడిని పసికట్టడంలో ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ విఫలం అయింది. హమాస్ ఏమి చేయలేదు అనే మితిమీరిన విశ్వాసంతో ఉన్న ఇజ్రాయెల్‌పై బ్రహ్మస్త్రంపై పిచ్చుక దాడిగా హమాస్ నింగి నేలా సముద్రం మీదుగా ఏకకాలంలో మెరుపుదాడులకు పాల్పడింది. ఇది అత్యంత పటిష్టమైన ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం అని విశ్లేషకులు తెలిపారు. గాజాస్ట్రిప్‌లో చలామణిలో ఉండే హమాస్ మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోకి భూ ప్రాంతాల మీదుగా తరలివచ్చారు. జలమార్గాలు, పారాచ్యూట్లతో దూసుకువచ్చారు. ఈ క్రమంలో పలువురు ఇజ్రాయెల్ సైనికులను బందీలుగా చేసుకున్నారు. సరిహద్దులలోనే తమ దాడికి మరింత పదును పెట్టారు.

ఇజ్రాయెల్ తమ ఇంటలిజెన్స్ సంస్థ ప్రపంచ ప్రఖ్యాత వేగు సంస్థ అయిన మోసాద్ సామర్థంపై తిరుగులేని నమ్మకంతో ఉంది. దేశీయంగా పనిచేసే ఇంటలిజెన్స్ సంస్థ షిన్ బెట్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. కాగా మోసాద్ అంతర్జాతీయంగా దాదాపుగా ప్రతిదేశాన్ని తన వేగు చర్యలతో గడగడలాడిస్తూ వస్తోంది. అయితే ఈ మోసాద్ కూడా ఇప్పుడు హమాస్ దాడిని ముందస్తుగా పసికట్టలేకపోయింది. ఇప్పుడు మోసాద్ పరిస్థితి మోసాడ్ అయిందని ఓ అమెరికన్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌కు గాజాస్ట్రిప్ ప్రాంతంలో ఉండే రక్షణ వ్యవస్థ అంతా ఇంతా కాదు. దుర్భేధ్యం. ఈ ప్రాంతంలో కాకలు తీరిన సైనిక బలగం సరిహద్దుల రక్షణగా ఉంటుంది. అత్యంత అధునాతన కెమెరాలు, ఈ సరిహద్దులలో 24 గంటలూ పనిచేసే మోసాద్, షిన్‌బెట్ ఏజెంట్లు ఉంటారు. పైగా అత్యంత అధునాతన ధర్మల్ ఇమేజింగ్ , తిరుగాడే సెన్సార్స్, ఈ ప్రాంతంలో ఇంతవరకూ ఈ దేశానికి లేని స్థాయిలో ఉండే సరిహద్దుల ఫెన్సింగ్ అమరికలు ఉంటాయి.

అయితే వీటిని అన్నింటిని బేఖాతరు చేస్తూ హమాస్ ఇప్పుడు చొచ్చుకుని రావడం గురించి సైన్యం జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రధానంగా ఇజ్రాయెల్ మంత్రులు ప్రస్తావిస్తున్నారు. ఇంటలిజెన్స్ వైఫల్యంపై శనివారం నాటి కేబినెట్ భద్రతా కమిటీ సమావేశంలో అంతా ఇదే వైఫల్యాన్ని పూర్తిస్థాయిలో ఎండగట్టినట్లు ప్రముఖ పోర్టల్ వైనెట్‌న్యూస్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News