Thursday, December 19, 2024

పాలస్తీనాపై రహస్య ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

పాలస్తీనా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కలిసి రహస్య ప్రణాళికలు కొన్ని రూపొందించారు. ఇజ్రాయెల్‌కు బైడెన్‌ను మించిన మిత్రుడైన కొత్త అధ్యక్షుడు ట్రంప్ అవే ప్రణాళికలను కొనసాగించగలరా లేక తన పాలస్తీనా విధానంలో మార్పు ఏదైనా ఉండవచ్చునా అన్నది ప్రశ్న అవుతున్నది. ట్రంప్ జనవరిలో అధికారం స్వీకరించిన తర్వాత గాని ఇందుకు సమాధానం లభించదు.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి? పాలస్తీనా దేశానికి తాము వ్యతిరేకమని నెతన్యాహూ స్పష్టంగా, బహిరంగంగా ప్రకటించారు. బైడెన్, ట్రంప్‌లు అటువంటి మాట బయటకు అనలేదు. పైగా రెండు స్వతంత్ర దేశాల విధానానికి అనుకూలమనే చెప్తున్నారు. కాని ఆచరణలో మాత్రం వ్యతిరేకత చూపుతున్నారు. ఇది, అమెరికాను డెమొక్రాట్లు, రిపబ్లికన్లతో ఎవరు పాలించినప్పటికీ, వారి విదేశాంగ విధానములో భాగమైపోయింది. 1947లో పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ను సృష్టించినపుడు ఐక్యరాజ్య సమితి తన తీర్మానంలో రెండు స్వతంత్ర దేశాల ప్రస్తావన చేసింది. అప్పటి నుంచి ఈ 2024 వరకు 77 సంవత్సరాలు గడిచినా పాలస్తీనా స్వతంత్ర దేశం కాకపోవటానికి గాని, ఐక్యరాజ్యసమితిలో పరిశీలక హోదా తప్ప పూర్తిస్థాయి సభ్యత్వం లభించకుండా ఉండటానికి గాని ఏకైక కారణం అమెరికా ద్వంద్వ నీతి. అటువంటి నీతిని ఈ 77 సంవత్సరాలలో ఏ పార్టీ పాలించినా కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ఏడాదికి పైగా ఇజ్రాయెల్ సేనలు గాజాలో సాగిస్తున్న మారణకాండకు, విధ్వంసానికి కారణం కూడా ఈ ద్వంద్వ నీతే. ఇంత తీవ్రమైన మానవ హననం సాగుతూ అన్ని ప్రపంచ స్థాయి సంస్థలతోపాటు ప్రపంచాభిప్రాయం వ్యతిరేకించినా ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా, నిధులు మంజూరుకు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఇరువురూ మద్దతు ఇస్తుండటంలోనే ఈ పరిస్థితి కనిపిస్తున్నది.
ఇటువంటి స్థితిలో కొత్త అధ్యక్షునిగా ట్రంప్ చేయగలది కొత్తగా ఏమైనా ఉండవచ్చునన్నది పూర్తిగా సందేహాస్పదమే. ట్రంప్ తన ప్రచార సమయంలో, గాజా యుద్ధం ఆగేట్లు చూడగలనని చెప్పింది నిజమే. కాని ఏవిధంగానో ఆయన వివరించలేదు. ఉక్రెయిన్ యుద్ధం 24 గంటలలో ఆగేట్లు చూడగలనని అన్నట్లే గాజా గురించిన మాట కూడా ఉంది తప్పే ఏ విషయంలోనూ స్పష్టత లేదు. ట్రంప్ తాను సాధారణ రూపంలోనే యుద్ధాలకు వ్యతిరేకమని పలుమార్లు అన్న మాట నిజం. ఈసారి గెలిచిన తర్వాత అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అదే మాట మరొక సారి అనటమే గాక, గతంలో తాను అధ్యక్షునిగా ఉన్నప్పుడు (201720) నాలుగేళ్లలో ఒక్కచోట కూడా యుద్ధం చేయని విషయాన్ని గుర్తు చేశారు. స్వయంగా అగ్రశ్రేణి వ్యాపారి అయిన ట్రంప్ అసలు పరిశ్రమలు, వ్యాపారాలు సజావుగా సాగాలంటే శాంతి నెలకొనాలి తప్ప యుద్ధాలు నష్టదాయకమని భావించటం సహజం. ఆ కారణంగా ఉక్రెయిన్, గాజా యుద్ధాలకు వ్యతిరేకం కావటం సహజం. ఆ కారణంగా ఉక్రెయిన్, గాజా యుద్ధాలకు వ్యతిరేకం కావటంలో ఆశ్చర్యం లేదు. కాని ఈ రెండు యుద్ధాలను ఎట్లా ఆపగలరన్నది ప్రశ్న. ఎందుకంటే, ముఖ్యంగా గాజా సమస్యలో చిక్కుముడులు అనేకం ఉన్నాయి.
అవి సాధారణమైన చర్చలతో విడిపోయేవి కావు. పాలస్తీనా ప్రజలకు స్వంత దేశమన్నది రాజీపడలేని విషయం. అటువంటి గుర్తింపును ఇజ్రాయెల్ తాను రాజీపడలేని అంశంగా గత 77 ఏండ్ల కాలంలో మార్చుకున్నది. ఘనీభవించిన కాలం పద్ధతిలో సమస్య అక్కడ ఘనీభవించి ఉంది. ఆ స్థితిలో ట్రంప్ చేయగలదేమిటి? పాలస్తీనా దేశం వద్దని గాని లేదా స్వాతంత్య్రం లేకుండా కేవలం స్వయం పాలిత హోదాకు గాని ఆయన అక్కడి ప్రజలను ఒప్పించటం ఎంత మాత్రం సాధ్యపడదు. మరి, రెండు స్వతంత్ర దేశాల పరిష్కారానికి ఇజ్రాయెల్‌ను ఒప్పించగలరా? అది జరిగితే తప్ప ఇంత కాలం వలె ఇక ముందు కూడా తరచు ఘరణలు, యుద్ధాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇజ్రాయెల్‌ను రాజీకి ట్రంప్ ఒప్పించగలిగితే మాత్రం ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వవచ్చు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అలీవ్ కాగా, దానిని వారు అంతర్జాతాయ చట్టాలకు, ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు విరుద్ధంగా, పాలస్తీనాకు చెందిన వెస్ట్ బ్యాంక్‌లోని జెరూసలేంకు బలప్రయోగంతో మార్చినపుడు, అప్పటి అధ్యక్షునిగా ట్రంప్ ఆ మార్పును ఆమోదించారు. ప్రస్తుత మారణహోమం సహా ఇజ్రాయెల్ చర్యలన్నింటికి మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే బైడెన్ కన్నా తీవ్రంగా మాట్లాడారు. ఇటువంటి నేపథ్యంలో ఆయన గాజా యుద్ధాన్ని ఏ విధంగా ఆపగలరు? ఇంకా చెప్పాలంటే, తాను అధ్యక్షునిగా ఉన్నపుడు అబ్రహాం ఒప్పందాల వంటి చర్చల ద్వారా, ఇరాన్‌పై పరోక్ష యుద్ధం ద్వారా ఇజ్రాయెల్‌కు, అరబ్ దేశాలకు మధ్య దౌత్య సంబంధాల కోసం, ఆ మార్గంలో పాలస్తీనా కేసును బలహీనపరచటం కోసం పలు ప్రయత్నాలు చేసిన రికార్టు ఆయనది. అందువల్లనే తన మాటలు అనుమానాస్పదమవుతున్నాయి.
పాలస్తీనా విషయమై రహస్య ప్రణాళికలన్న మాటను ఈ రకరకాల నేపథ్యంలో చూడవలసి ఉంటుంది. ఇజ్రాయెల్ పై హమాస్ నిరుడు ఆగస్టులో చేసిన దాడి కారణంగానే తాము ప్రస్తుత యుద్ధం సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ చెప్తున్నది. హమాస్ తన దాడిలో అనుసరించిన పద్ధతి టెర్రరిజమనటంలో సందేహం లేదు. కాని ఇజ్రాయెల్ దానిని అవకాశంగా తీసుకుని సాగిస్తున్న మారణకాండలో కేవలం హమాస్‌ను శిక్షించటం గాక అంతకు మించిన లక్షాలున్నట్లు వారి మాటలతో పాటు బైడెన్ ప్రభుత్వం వైఖరిలో వెల్లడవుతున్నది. ఆ లక్షం ఏమిటో నెతన్యాహూ స్వయంగా ప్రకటిస్తుండగా, బైడెన్ ఆ మాట చెప్పకుండానే అందుకు తన ఆచరణ ద్వారా మద్దతునిస్తున్నారు. ఆ లక్షాలు గాజాలోని పాలస్తీనియన్లను వీలైనంత మేర చంపివేసి, తక్కిన ప్రజలను అక్కడి నుండి తరిమి వేయటం, ఇంకా మిగిలి ఉంటే పూర్తిగా తమకు అణిగిమణిగిపడి ఉండేట్లు చూడటం. గాజాను సైనికంగా ఆక్రమించి తమ ప్రత్యక్ష లేదా పరోక్ష పాలన కిందకు తేవటం. ఇక వెస్ట్ బ్యాంక్ అయితే తమ ఇజ్రాయెల్‌లో ఒక భాగమని బాహాటంగా ప్రకటించిన నెతన్యాహూ, అక్కడ యూదుల సెటిల్మెంట్లు అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నట్లు చట్టవిరుద్ధం కావని, వాటిని పెంచుతూనే పోగలమంటున్నారు. అదే పని చూస్తూ అక్కడి పాలస్తీనియన్ల పట్ల హత్యలు, ఇతర దమనకాండ కొనసాగిస్తున్నారు.
గమనించవలసిందేమంటే ఈ చర్యలన్నింటిపట్ల బైడెన్ ప్రభుత్వం నామమాత్రపు వ్యతిరేకత ఏదో చూపి ప్రపంచం కళ్ళు మూసేందుకు ప్రయత్నంచటం తప్ప, దీనినంతా నిరోధించగల శక్తి ఉండి కూడా ఆ పనిచేయటం లేదు. అది చాలదన్నట్లు, ఐక్యరాజ్యసమితి నుంచి, ఇతరత్రా ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్నున్నది. ఆయుధాలు, నిధుల సరఫరాలు సరేసరి. దీనంతటి ఫలితంగా జరుగుతన్నదేమిటి? పైన పేర్కొన్న విధంగా తమ లక్షాలను ముందుకు తీసుకుపోయేందుకు ఇజ్రాయెల్‌కు పూర్తి సహాయ సహకారాలు లభిస్తున్నాయి. అనగా, ఇజ్రాయెల్ రహస్య ప్రణాళికలలో అమెరికా అప్రకటిత భాగస్వామి అవుతున్నదన్న మాట. అందుకు సహకరిస్తున్నదన్న మాట. రహస్య ప్రణాళికలు అంటున్నది వీటినే. మరీ అంత రహస్యం కాదన్నది వేరే విషయం.
అమెరికాలోని మహా శక్తివంతమైన యూదు లాబీల ప్రభావం మొదటి నుంచీ గల డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలు గత 77 సంవత్సరాలుగా ఈ విధంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే, పాలస్తీనాను బలవంతంగా విభజించి ఇజ్రాయెల్‌ను సృష్టించటం నుంచి మొదలుకొని, కనీసం సమితి తీర్మానం మేరకు రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటుకుగాని, 1993లో స్వయంగా అమెరికా చొరవతో జరిగిన ఓస్లో ఒప్పందం అమలుగాని, గాజాతో వెస్ట్ బ్యాంక్‌లో హత్యలూ అణచి వేతల నిరోధానికిగాని, వేలాది యూదుల చట్టవిరుద్ధమైన సెటెల్మెంట్లు ఆపేందుకు గాని ఆచరణలో ఏమీ చేయకుండా కపటపు మాటలకు పరిమితమవుతూ వస్తున్నారు. ఈ స్థితిలో, ఇజ్రాయెల్‌కు బైడెన్‌కు మించిన మద్దతుదారు అయిన ట్రంప్, పైన పేర్కొన్న రహస్య ప్రణాళికలను మరింత ముందుకు తీసుకుపోకుండా ఉంటే ఆశ్చర్యపడాలి. ట్రంప్ ఎన్నిక కాగానే ఆయనకు అభినందనలు అత్యుత్సాహంతో తెలిపిన నెతన్యాహూ వైఖరిని బట్టే మనకు అర్ధం కాగలది చాలా ఉంది. అందువల్ల గాజాతో పాటు పాలస్తీనా సమస్య పరిష్కారానికి ఆశలేమీ కన్పించటం లేదు. అటువంటిది జరిగితే అద్భుతమే అవుతుంది.

టంకశాల అశోక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News