జెరూసలెం : ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగడంతో ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్టు సైన్యం ప్రకటించింది. వివాదాస్పద గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలెం, టెల్ అవివ్ సహా దేశ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధి లోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ముఠాలు కూడా చేరినట్టు తెలుస్తోంది.
హమాస్ కాల్పుల్లో 22 మంది మృతి
హమాస్ మిలిటెంట్ల దాడితో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరో 550 మంది గాయపడినట్టు తెలిపాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లో ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చినట్టు సమాచారం. కొంతమంది సైనికులు, పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకుని వారిని గాజాకు తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
యుద్ధంలో ఉన్నాం… నెతన్యాహు ప్రకటన
తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందిస్తూ తమ దేశం యుద్ధంలో ఉందని అధికారికంగా వెల్లడించారు. “ శత్రువులపై ఆపరేషన్లు, కాల్పులు కాదు. మేం యుద్ధం చేస్తున్నాం. ఇజ్రాయెల్ పౌరులను లక్షంగా చేసుకుని ఈ ఉదయం హమాస్‌క్రూరమైన మెరుపు దాడికి దిగింది. ఉగ్రవాదులు చొరబాటు చేసిన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భద్రతా దళాలను ఆదేశించాను. అదే సమయంలో శత్రువులపై కాల్పులు జరిపి వారిని తరిమి కొట్టాలని ఆదేశాలు జారీ చేశా. శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు” అని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నెతన్యాహూ హమాస్‌ను హెచ్చరించారు.
5 వేల రాకెట్ల వర్షం..
ఇజ్రాయెల్ పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ఈ తెల్లవారు జామునే ‘ఆపరేషన్ ఆల్ ఆక్సా స్ట్రామ్’ ప్రారంభమైందని , ఇప్పటివరకు 5 వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్టు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్ పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం … యుద్ధ తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇజ్రాయెల్ ‘ఐరన్ స్వార్డ్ ’
తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందించారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని, ఈ యుద్ధంలో తామే గెలుస్తామని అన్నారు. ‘ఇజ్రాయెల్ సైన్యం ప్రతి చోటా శత్రువులతో పోరాడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. భద్రతా పరమైన సూచనలను పాటించండి. ’ అని మంత్రి తెలిపారు. అటు హమాస్‌ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ “ఐరన్ స్వార్డ్” ప్రారంభించింది.గాజా లోని హమాస్ స్థావరాలను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఈ క్రమం లోనే గాజా లోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా ఆరోపించింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
హమాస్ అధీనంలో పోలీస్ స్టేషన్
అటు ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్‌లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగం లోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దు లోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దాన్ని తమ అధీనం లోకి తీసుకున్నారు. అటు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్టు సమాచారం.
సైనికుల కిడ్నాప్ ..
సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మీడియా ఆరోపించింది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్ చేసినట్టు పేర్కొంది. 1967 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే డిమాండ్‌తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.
యుద్ధం ప్రభావం…ఇజ్రాయెల్ లోని భారతీయులకు ఢిల్లీ అడ్వైజరీ
జెరూసలెం : హమాస్ మిలిటెంట్ల మెరుపుదాడితో ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని భారత పౌరులకు అక్కడి భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అనవసరంగా బయటికి రావొద్దని హెచ్చరించింది. “ ఇజ్రాయెల్ లో ప్రస్తుత పరిస్థితుల దృష్టా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటించాలి.అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. సురక్షిత శిబిరాలకు చేరువగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండి ” అని టెల్‌అవీవ్ లోని భారత దౌత్య కార్యాలయం తమ అడ్వైజరీలో పేర్కొంది. అదనపు సమాచారం కోసం ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్‌సైట్ లేదా వారి బ్రోచర్‌ను చూడాలని పేర్కొంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్ + 97235226748 లేదా cons 1.telaviv@mea.gov.in ఇమెయిల్ ద్వారా సంప్రదించాలని ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరులను కోరింది. ఎలాంటి సహాయమైనా అందించేందుకు ఎంబసీ సిద్ధంగా ఉందని పేర్కొంది.
ప్రపంచ దేశాల ఖండన
హమాస్ దాడికి పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హమాస్‌అకృత్యాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి.
ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదిస్తున్నాం : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదుల దాడులు తీవ్ర దిగ్భ్రాంతికరం . తమ దేశాన్ని రక్షించుకోడానికి ఇజ్రాయెల్‌కు పోరాడే హక్కు ఉంది. పరిస్థితులపై ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. అక్కడి బ్రిటన్ పౌరులు ప్రయాణ సూచనలను పాటించాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు.
హమాస్ దాడులు అత్యంత తీవ్రమైనవి : స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యూల్ అల్బరెస్
ఇజ్రాయెల్‌పై దాడులు అత్యంత తీవ్రమైనవి. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హమాస్ ఉగ్రవాదుల అమానుష హింస దిగ్భ్రాంతికరం అని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యూల్ అర్బరెస్ ఖండించారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా బాధ్యతా యుతంగా వ్యవహరించాలి: టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్
ఇజ్రాయెల్ , పాలస్తీనా బాథ్యతాయుతంగా వ్యవహరించాలి. ఉద్రిక్తతలను మరింత పెంచేలా దుందుడుకు చర్యలకు దూరంగా ఉండాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సూచించారు.