Monday, December 23, 2024

ట్రిగ్గర్ నీడలో గాజాపట్టి..

- Advertisement -
- Advertisement -

రాఫా (గాజా స్ట్రిప్) : ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ సేనల భూతల దాడులు జరుగుతాయనే భయాలు, మరో వైపు ఉండటానికి వీల్లేని సంకట పరిస్థితి నడుమ గాజాలోని లక్షలాది మంది సామాన్య పాలస్తీనియన్లు విలవిలలాడుతున్నారు. హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగి విధ్వంసానికి పాల్పడిన ఘటన తరువాత టెల్ అవీవ్ హమాస్ నిర్మూలనకు పంతం వహించింది. గాజా ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు సరిహద్దులలో భారీ స్థాయిలో ఇజ్రాయెల్ శక్తివంతమైన సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయి. దీనితో జనం దిక్కుతోచని స్థితిలో ఆసుపత్రులు, స్కూళ్లలోకి చొరబడి తలదాచుకుంటున్నారు. దీనితో అనేక చోట్ల ఇవి కిక్కిరిసిపొయ్యాయి. వీటిలో ఆశ్రయం పొందితే కనీసం తమ ప్రాణాలు దక్కుతాయని , ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవచ్చునని వారు చిట్టచివరి ఆశలతో నెట్టుకొస్తున్నారు.

సోమవారం గాజా, ఈజిప్టు మధ్య కూడలిగా ఉండే రాఫా క్రాసింగ్ జనజాతర, రణగొణధ్వనులు, ఆకలికేకల వేదిక అయింది.గాజా ప్రాంతంలో మంచినీటికి, తిండికి, చివరికి మందులకు కూడా కటకట ఏర్పడటంతో జనం తమకు వినపడుతున్న ఇజ్రాయెల్ సైన్యపు హెచ్చరికల సైరన్ల నడుమ నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రాసింగ్ ప్రాంతంలో ఇప్పుడు వందలాది ట్రక్కులు నిలిచి ఉన్నాయి. గాజాలోని బాధితులకు అవసరం అయిన తక్షణ సహాయక సామాగ్రితో ట్రక్కులు వచ్చి ఈ సరిహద్దులలో నిలిచాయి. ట్రక్కులు ముందుకు సాగేందుకు, విదేశీయులు ఈజిప్టు ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించాలని, కాల్పులవిరమణ పాటించాలని పలు విజ్ఞప్తులు వెలువడుతున్నాయి గాజా నుంచి ఈజిప్టునకు వెళ్లేందుకు ఉన్న ఏకైక కూడలి కేవలం రాఫానే . పాలస్తీనియా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల క్రమంలో ఈ క్రాసింగ్‌ను మూసివేశారు.

అయితే ఇక్కడి నుంచి అత్యవసర సరుకులు వస్తేనే గాజాస్ట్రిప్‌లో ఆకలితో అలమటిస్తున్న , ఆసుపత్రులలో చికిత్సలతో మందుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రాణాలు నిలుస్తాయి.ఈ క్రాసింగ్‌ను గాజా వైపు నుంచి తెరిచేందుకు అనుమతినివ్వాలని తాము కోరినా, ఈ ప్రాంతంలో కాల్పులకు దిగరాదని కోరినా ఇంతవరకూ ఇజ్రాయెల్ అధికార యంత్రాంగం నుంచి తమకు ఎటువంటి సమాధానం రాలేదని ఈజిప్టు విదేశాంగ మంత్రి సమే షౌక్కీ సోమవారం తెలిపారు. ఇప్పుడు తాము చేసేదేమి లేదని చెప్పారు.

ఇక మూత దశకు చేరిన ఆసుపత్రులు
ఓ వైపు వేలాదిగా జనం చికిత్సలకు తరలివస్తున్నారు. అయితే తామేమీ చేయలేని స్థితిలో ఉన్నామని , చికిత్స ఏర్పాట్లు లేవు. గాయపడ్డ వారికి అవసరం అయిన మందులు అయిపొయ్యాయి. విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. జనరేటర్లకు ఇంధనం లేక అవి కూడా మొరాయిస్తున్నాయి. ఇక ఆసుపత్రులను తెరిచి ఉంచి కూడా ప్రయోజనం ఏముందని ఆసుపత్రి అధికారులు ప్రశ్నిస్తున్నారు. వెంటిలేటర్లు , ఆక్సిజన్ నిల్వలు లేకుండా పొయ్యాయని, కేవలం ఒక్కరోజుకు సరిపడా ఆక్సిజన్ కోటా ఉందని , ఇక జనం ఆసుపత్రులకు వచ్చినా వారికి ఎటువంటి చికిత్స అందించే స్థితిలో లేమని అధికారులు తెలియచేస్తున్నారు. ఇక అత్యవసర సహాయ కేంద్రాలలో ఉన్న లక్షలాది నిరాశ్రయ పాలస్తీనియన్లు ఇప్పుడు తీవ్రస్థాయిలో మంచినీటి కటకట ఎదుర్కొంటున్నారు. ప్రతి మనిషికి రోజుకు ఒక్కలీటరు వరకే నీటిని అందించగల్గుతున్నారు. ఇప్పటివరకూ జరిగిన దాడుల క్రమంలో 2750 మంది పాలస్తీనియన్లు , 1400 మందికి పైగా ఇజ్రాయెలీలు హతులయ్యారు. గాజాలో గాయపడ్డ వారి సంఖ్య 10వేలకు పైగా ఉంది. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

పరస్పర రాకెటు దాడులు
ఓ వైపు జనం హాహాకారాలు సాగుతూ ఉండగానే ఇజ్రాయెల్ ముందుగా వ్యూహాత్మకంగా గాజాస్ట్రిప్ పొరుగుప్రాంతాలపై వైమానిక దాడులను ముమ్మరం చేసింది. హమాస్ బలగాలకు సమీపంలోని సిరియా, లెబనాన్ లలోని తీవ్రవాదుల నుంచి సాయం అందుతోందనే సమాచారంతో ఇజ్రాయెల్ ముందుగా ఆయా ప్రాంతాలను దిగ్బంధం చేస్తూ వచ్చింది. అయితే మరో వైపు గాజా నుంచి ఇప్పటికీ హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పైకి పలు రాకెట్లు ప్రయోగించాయి. వీటిని తిప్పికొడుతూ ఇజ్రాయెల్ బలగాలు ఇప్పుడు గాజాస్ట్రిప్‌పై ప్రత్యేకించి హమాస్ కంచుకోట అయిన ఉత్తర ప్రాంతంపై కట్టుదిట్టమైన రీతిలో భూతల దాడికి రంగం సిద్ధం చేసుకొంటోంది. ముందుగా ఈ ప్రాంతంలోని పౌరులను దూరప్రాంతాలకు వెళ్లేలా చేసేందుకు హెచ్చరికల ద్వారా యత్నిస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న పలువురు హమాస్ నేతలను, ఇక్కడి హమాస్ కట్టుదిట్టమైన స్థావరాలను ఎటువంటి విచక్షణ లేకుండా పూర్తిగా దెబ్బతీయడానికి ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసుకుంది.

పౌరులు లేకుండా నిర్మానుష్యంగా గాజా ప్రాంతం ఉంటే తమ గ్రౌండ్ ఆటాక్ ఆపరేషన్ సజావుగా సత్వరంగా ముగుస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ముందుగా బందీలను విడిపించడం, హమాస్ సైనిక సాధనసంపత్తిని ధ్వంసం చేయడం కీలక అంశాలు అయ్యాయి. అయితే ఈ ప్రాంతాలలో అనేక చోట్ల పౌరుల నివాసిత ప్రాంతాలు ఉండటం, అక్కడక్కడ ఇజ్రాయెల్ నివాసిత సముదాయలు కూడా వెలిసి ఉండటంతో ఇజ్రాయెల్ సేనలు వెనువెంటనే పెద్ద ఎత్తున భూతల దాడులకు దిగడం లేదు. అయితే తాము ఇప్పుడు ట్రిగ్గర్ నొక్కిపెట్టి ఉంచామని, ఇక ఎప్పుడైనా తూటాలు దూసుకువెళ్లడమే తరువాయి అని ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు తెలిపారు. ఇప్పుడు ప్రతి వీధిలో సాగే పరస్పర దాడులు తీవ్రస్థాయి ప్రాణనష్టానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం అయింది. గాజా సరిహద్దులలోకి వచ్చి చేరిన ఇజ్రాయెల్ బలగాలు వరుసగా మూడో రోజున కూడా పౌరులు ఈ ప్రాంతం వీడిపోవాలని హెచ్చరిస్తూ వారు బయటకు తరలివెళ్లేందుకు సేఫ్ కారిడార్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో పౌరులు ఈ ప్రాంతాన్ని వీడివెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News