గాజాస్ట్రిప్‌లో మరోసారి నరమేధం జరిగింది. శనివారం ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. చిరకాల యుద్ధ పీడిత వలయం అయిన గాజాస్ట్రిప్ దక్షిణ ప్రాంతంలోని ఖాన్‌యూనిస్ వద్ద ఇజ్రాయెల్ సైనిక దాడి జరిగింది. దాడి తరువాత ఈ ప్రాంతంలో భయానక స్థితి ఏర్పడింది. గాయపడ్డ వారిని, మృతులలో పలువురిని వెంటనే అక్కడి నసీర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆగకుండా పలుసార్లు దాడులు జరిగినట్లు నిర్థారించారు. తాము 40కి పైగా మృతదేహాలను లెక్కించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్టులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై పూర్తి స్థాయి దాడులను మొదలుపెట్టింది.
అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మారణహోమం సాగుతూనే ఉంది. ఇప్పుడు జరిగిన దాడి ఖచ్చితంగా ఏ ప్రాంతంలో జరిగిందనేది పూర్తిగా నిర్థారించలేదని కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. ఇజ్రాయెల్ గుర్తించిన దాడుల రహిత మానవీయ ఔదార్యపు ప్రాంతం మువాసిపైనే ఇజ్రాయెల్ దాడుల సాగించిందా? అనేది స్పష్టం కాలేదు. అక్కడ నిర్వాసిత పాలస్తీనియన్లు వేలాదిగా భద్రతకు తరలివెళ్లారు. తాత్కాలిక షెడ్లు, సహాయక శిబిరాలలో తలదాచుకుంటున్నారు. ఈ శిబిరాలను లక్షంగా చేసుకునే ఇజ్రాయెల్ దాడికి దిగినట్లు అయితే ఇది అంతర్జాతీయ మానవీయ ప్రమాణాల కొలమానాలకు పూర్తిగా భంగకరం అయిన అంశం అవుతుంది.