Wednesday, January 22, 2025

హమాస్ బలం..శత్రు దుర్భేద్య సొరంగ మార్గం

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: ఇజ్రాయెలీ సైన్యానికి గల అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హమాస్ సరితూగ లేనప్పటికీ రహస్య సొరంగ మార్గాలతో కూడిన అత్యంత శక్తివంతమైన వ్యవస్థ హమాస్‌కు శత్రువులు సైతం నివ్వెరపోయేంత బలమనే చెప్పుకోవాలి. ఈ సొరంగ మార్గాలతోపాటు గాలి, హూమి, సముద్రం ద్వారా గతవారం ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ సైన్యం 1200 మందిని హతమార్చింది.

తమపై జరిగిన దాడికి ప్రతీకారంగా గాజాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి ఈ సొరంగ మార్గాల వ్యవస్థే సంక్లిష్ట పరిస్థితులను కల్పిస్తోంది. గాజాలో రెండు పొరలుగా ఉన్న ఈ సొరంగ మార్గాల వ్యవస్థలో ఒక పొర పౌరులకు, రెండో పొర హమాస్‌కు ఉపయోగపడుతోందని, హమాస్ నిర్మించిన రెండో పొరను చేరుకోవడానికే తాము ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెలీ రక్షణ దళాల ప్రినిధి జోనాతన్ కాన్రికస్ చెబుతున్నారు. భూమిలోపల నిర్మించిన సొరంగ మార్గాలను కూల్చడం అంత సులభమేమీ కాదు. గతంలో కూడా వీటిని గుర్తించి ధ్వంసం చేయడానికి ఇజ్రాయెలీ సేనలు ప్రయత్నించి విఫలమయ్యాయి. దీనికి కారణంగా ఆ సొరంగ మార్గాల అనుపానులు పూర్తిగా తెలిసింది కేవలం హమాస్‌కు మాత్రమే.

గాజాలో భూమి లోపల నిర్మించిన దాదాపు 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలను ఇజ్రాజెల్ 2021లో ధ్వంసం చేసింది. అయితే తమకు 500 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాల వ్యవస్థ ఉందని, ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది అందులో కేవలం 5 శాతం మాత్రమేనని హమాస్ అప్పట్లో ప్రకటించింది.

కాగా..శత్రువుపై పైచేయి సాధించాలన్న పట్టుదలతో అత్యంత అధునాతన సొరంగ మార్గాల గుర్తింపు వ్యవస్థను తయారు చేయాలని 2014లో ఇజ్రాజెల్ నిర్ణయించింది. ఇందు కోసంతమ దేశంలోని ఆక్షణ వ్యవస్థల తయారీ సంస్థలలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థలు సొరంగ మార్గాలను కనిపెట్టే వ్యవస్థలను రూపొందించినప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వలేదు. భూమిలోపల మలుపులు తిరుగులూ, మధ్యలో రెండు మార్గాలుగా విడిపోయే సొరంగ మార్గాలను కనిపెట్టగల సమార్థం ఈ సెన్సార్లకు ఉండదని, అవి తికమక పడుతుంటాయని టెల్ అవీవ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ స్టడీస్ పరిశోధనలో వెల్లడైంది.

అత్యంత అధునాతనమైన ఆయుధ సంపత్తి ఉన్నప్పటికీ సొరంగ మార్గాల వ్యవస్థను దెబ్బీతీయడం అంత సులభమైన పని కాదని ఇజ్రాయెలీ సైనిక రంగ నిపుణుడు స్కాట్ సావిట్జ్ అంటున్నారు. అసలు సొరంగం ఉందా..అవి ఎన్ని ఉన్నాయి..అవి ఎక్కడ ఉన్నాయి..వంటి విషయాలేవీ శత్రువుకు తెలియవని, అవి కంటపడినప్పుడే అవి ఉన్నాయన్న విషయం తెలుస్తుందని ఆయన చెప్పారు.

అత్యధిక జన సాంద్రత గల గాజా నగరం కింద నిర్మించిన సొరంగాలను హమాస్ అనేక సంవత్సరాలుగా ఆయుధాలను దాచిపెట్టడానికి, తన సైనికులకు స్థావరం కల్పించడానికి, కమాండ్ కంట్రోల్ కోసం ఉపయోగిస్తోంది. ఈ సొరంగ మార్గాలలో విద్యుత్ సౌకర్యంతోపాటు గాలి..వెలుతురు లభించే సౌకర్యాలు కల్పించడంతో ఈ మార్గాలు మరింత ఎక్కువగా ఉపయోగంలోకి రావడం మొదలైంది.

కొన్ని సొరంగాలు భూమి లోపల 35 మీటర్ల అడుగుల లోతులో ఉండగా కొన్నిటికి రైలు మార్గం, కమ్యూనికేషన్ గదులు వంటివి కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వీటి ప్రవేశం నివాస భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలలో ఉండడం విశేషం. మొడట్లో ఈ రహస్య సొరంగ మార్గాలను ఈజిప్టు నుంచి సరకులు, ఆయుధాల అక్రమ రవాణా కోసం హమాస్ ఉపయోగించుకునేది. తర్వాత కాలంలో సరిహద్దుల అవతల శత్రుదేశంపై దాడులు జరిపేందుకు ఈ సొరంగ మార్గాలను హమాస్ ఎంచుకోవడం ప్రారంభించింది. 2006లో ఈ సొరంగ మార్గం ద్వారానే ఇద్దరు ఇజ్రాయెలీ సైనికులను చంపి గిలాడ్ షలిత్ అనే 19 ఏళ్ల సైనికుడిని కిడ్నాప్ చేసిన హమాస్ ఐదేళ్ల తర్వాత అతడిని విడుదల చేసింది. ఇందుకు ప్రతిగా 1,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయక తప్పలేదు.

సొరంగ మార్గాలను ధ్వంసం చేసేందుకు 2014లో ఇజ్పాయెల్ గాజాపై భమార్గంలో దాడి చేసింది. అయితే హమాస్ తీవ్రవాదులు మెరుపుదాడులు చేసి ఇజాజెలీ సైనికులను పెద్ద సంఖ్యలో హతమార్చారు. అయితే ఈజిప్టు కూడా గాజాలోని ఈ సొరంగ మార్గాలపై గురిపెట్టింది. వీటిని ధ్వంసం చేసేందుకు వాటిలోకి నీటి ప్రవాహాన్ని పంపడం వంటి చర్యలకు పాల్పడింది.
రోబోల ద్వారా ఈ సొరంగ మార్గాల వ్యవస్థను కనిపెట్టడం కొంతలో కొంత క్షేమకరమనే చెప్పాలి. అయితే సొరంగాలలో ఎటువంటి భద్రతాపరమైన వ్యవస్థ ఉందో తెలియకుండా లోపలకు ప్రవేశించడం వల్ల ప్రయోజనం ఉండదని, ఇజ్రాయెలీ సైనికులు ఒకవేళ ఆ సాహసం చేస్తే ప్రమాదంలో చిక్కుకుంటారని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News