కోల్‌కతా : సందేశ్ ఖాళీలో ఇటీవల ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసును కలకత్తా హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ బలమైన నాయకుడు షాజహాన్ షేక్‌ను కూడా సీబీఐ కస్టడీకి అప్పగించాలని బెంగాల్ పోలీస్‌లను న్యాయస్థానం ఆదేశించింది. రేషన్ బియ్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ ఇంట్లో తనిఖీల కోసం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై ఆయన అనుచరులు జనవరి 5న దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ సంఘటన తరువాత ఆయన పరారయ్యారు. ఈ నేపథ్యంలో షాజహాన్‌పై అత్యాచార ఆరోపణలు చేస్తూ సందేశ్ ఖాలీ మహిళలు సాగించిన ఆందోళన దుమారం రేపింది. తీవ్ర వివాదాస్పదంగా మారిన ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించడంతో చివరకు ఫిబ్రవరి 29న ఆయనను పోలీస్‌లు అరెస్టు చేశారు. అయితే ఈడీ అధికారులపై దాడి కేసులో దర్యాప్తుకు సీబీఐ, రాష్ట్ర పోలీస్‌ల సంయుక్త సిట్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టు జనవరి 17న తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ , బెంగాల్ ప్రభుత్వం విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశాయి. దర్యాప్తును పూర్తిగా సిబిఐకి అప్పగించాలని ఈడీ కోరగా, రాష్ట్ర పోలీస్‌లకే ఇవ్వాలని టీఎంసీ ప్రభుత్వం అభ్యర్థించింది. దీనిపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపి, దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.