Saturday, November 23, 2024

పాలాభిషేకాలతో దివ్యాంగుల పండగ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ మరో వెయ్యి రూపాయలు పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే దివ్యాంగులకు పెన్షన్ అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. తాజా పెంపుతో దివ్యాంగుల పెన్షన్ మొత్తం రూ. 4,116 చేరుకుంది. దీంతో దివ్యాంగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం తెలంగాణ భవన్ లో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

దివ్యాంగుల సమాజం తరుపున ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చైర్మన్ వాసుదేవ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మానవీయ పాలనకు ఇదొక నిదర్శనమని అన్నారు. దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.40 లక్షల మంది దివ్యంగులకు నెలకు రూ. 3,016 పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. తద్వారా నెలకు రూ .180 కోట్లు, సంవత్సరానికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు, పెన్షన్‌లే గాకుండా వికలాంగుల సహకర సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నారన్నారు. తాజాగా పెంచిన పెన్షన్ తో రాష్ట్రంలో దివ్యాంగులకు మరింత ఆర్ధిక భరోసా లభించిందని, దివ్యంగుల్లో ఒక నూతన ఉత్సాహం వెల్లివిరిసిందని అన్నారు. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం, మనొనిబ్బరం పెరిగిందని పేర్కొన్నారు. కెసిఆర్‌కు దివ్యాంగుల సమాజం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తం పెన్షన్లు ఇస్తున్నా రాష్ట్రం లేదని, దేశ ప్రధాని నరేంద్ర మోడి సొంత రాష్ట్రం లో కూడా దివ్యాంగులకు ఇచ్చేది కేవలం రూ. 1000 మాత్రమేనన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగుల పెన్షన్ కోసం 10 వేల కోట్లకుపైగా వెచ్చించడం దివ్యాంగుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. కెసిఆర్ పాలనలో వికలాంగుల సంక్షేమానికి తాను ప్రతినిధిగా ఉండటం గొప్ప అదృష్టమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా దివ్యాంగులతో ఎంఎల్‌ఎలు, స్థానిక ప్రజా ప్రతినిధులు సహపంక్తి భోజనాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల సంఘాల నాయకులు మున్న, రాజ్యలక్ష్మి, అంధుల ప్రతినిధులు భాస్కర్, మహేందర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News