ఖమ్మం : స్వదేశీ హ్యాండీ క్రాప్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఖమ్మం కొత్త బస్టాండ్ దోరెపల్లి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన చేనేత హస్తకళల ప్రదర్శనను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక చేనేత కళాకారులకు చేతినిండా పనిని ప్రభుత్వం కల్పించిందన్నారు. మన చేనేత కళాకారుల ఉత్పత్తులు దేశదేశాల్లో మంచి ఆధరణ చూరగొన్నాయని పేర్కోన్నారు.
తెలంగాణలో చేనేత హస్త కళాకారుల అభివృద్ధికి కెసిఆర్ ప్రబుత్వం పాటుపడుతుందని చెప్పారు. అదేవిధంగా హస్తకళల కళాకారులు కూడా ఎన్నో గొప్ప గొప్ప కళాకృతులను తయారు చేసి తమ ప్రతిభతో చక్కటి పేరును తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఎక్కడ నుంచో వచ్చిన ఈ కళాకారులను ఖమ్మం నగర ప్రజలు ఆధరించాలని ఆమె కోరారు. అనంతరం నిర్వాహకులు చిరంజీవి మాట్లాడుతూ జూలై 17 వరకు సాగే ఈ మేళాలో పోచంపల్లి మొదలుకుని చందేరి ఉత్పత్తుల వరకు కొలువుదీరినట్లు చెప్పారు.
అదేవిధంగా హస్తకళల్లో పలు నూతన ఉత్పత్తులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఆదివారంతో పాటు అన్ని సెలవుదినాల్లో కూడా ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. నగర ప్రజలు తమను ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్తానికులతో పాటు పలువురు చేనేత హస్తకళాకారులు పాల్గొన్నారు.