Monday, December 23, 2024

చేతివృత్తులను ఆధునీకరించండి : జూలూరు గౌరీశంకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దార్శనిక ఆలోచనలతో బహుజనుల కోసం చేపడుతున్న ప్రభుత్వ పథకాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కేంద్రాలుగా సాంకేతిక విశ్వవిద్యాలయాల్ని తయారు చేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. బీసీలు, ఎంబీసీల కోసం లక్షరూపాయల సహాయం చేసే ప్రభుత్వ పథకానికి బహుజనులను ఉత్పత్తి శక్తులుగా మార్చేందుకు ఇంజనీరింగ్ కళాశాలలను ప్రయోగశాలలుగా మార్చేందుకు కార్యాచారణ పథకాన్ని రూపొందించాలని ఆయన కోరారు.

దేశానికే మోడల్ గా చేపట్టిన ప్రభుత్వ పథకాలకు సాంకేతిక జ్ఞాన ఇంజన్లను తయారు చేసే కేంద్రాలుగా కళాశాలలు తీర్చిదిద్దాలని అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పూర్తి స్థాయి చైర్మన్ గా ప్రొఫెసర్ ఆర్. లింబాద్రిని నియమించిన సందర్భంగా మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన్ని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని తలంచి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో అనేక వినూత్న పథకాలను చేపట్టారని తెలిపారు.కెసిఆర్ చేపట్టిన పథకాలు ఈ రోజు దేశానికే మోడల్ గా మారాయని అన్నారు. బిసిలు, ఎంబిసిల ఎంబీసీల కోసం ప్రభుత్వం చేసే లక్షరూపాయల డబ్బుతో చేతివృత్తులు స్వతంత్రంగా నిలబడడానికి ఆధునిక పరిజ్ఞానంతో ఏవిధంగా ఉత్పత్తులను పెంచుకోవచ్చునో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి అందించే బాధ్యతను ఉన్నత విద్యామండలి తీసుకోవాలన్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లక్షరూపాయల పథకం వేలాది మంది సహస్రవృత్తుల చేతివృత్తులకు అండగా నిలిచే వస్తువులను తయారు చేసే విధానాన్ని వారికి అందిస్తే అవి దేశానికే గొప్ప మానవ సంపదగా మారుతాయని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ముప్పయి మూడు జిల్లాల్లో వివిధ చేతివృత్తులకు సంబంధించిన వర్క్ షాపులు నిర్వహించాలని అన్నారు. నగరంలో సిగ్నల్ లైట్లు పడ్డ రెండు మూడు నిముషాల్లో ఒక వస్తువును అమ్మగలిగిన వ్యాపారాత్మక నైపుణ్యాలు సంచార జాతుల సొంతమని వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే దేశానికే కావలసిన ఉత్పత్తి శక్తులుగా మారుతారని అన్నారు. కెసిఆర్ దార్శనిక ఆలోచనలకు అండదండగా బహుజనుల చేతివృత్తులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కేంద్రాలుగా ఇంజనీరింగ్ కళాశాలలను మలచాలన్నారు. ప్రతిభ ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోత్సాహమిస్తే చేతివృత్తులను ఆధునీకరించే అద్భుత ఆవిష్కరణలతో ఉత్పాదక రంగానికి ఎంతో మేలు చేస్తారని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ గా నియమితులైన డా. యస్.కే. మహ్మూద్ ను జూలూరు ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరుతో పాటు కార్యదర్శి నామోజు బాలాచారి కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News