Friday, November 15, 2024

ఉరికాకుండా మరేవిధంగా శిక్షను అమలు చేద్దాం : సుప్రీం

- Advertisement -
- Advertisement -

ఉరిశిక్ష ప్రభావంపై కేంద్ర నివేదిక కోరిన సుప్రీం

న్యూఢిల్లీ : కొన్ని కేసుల్లో మరణశిక్ష విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మెడకు ఉరి వేసి, చంపడం కన్నా, నొప్పి లేనటువంటి ఇతర పద్ధతుల్లో ప్రాణాలు తీసే వీలు ఉందా అని మంగళవారం సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మెడకు ఉరి వేసి శిక్షించడం కన్నా తక్కువస్థాయి నొప్పితో చనిపోయే పద్ధతుల గురించి సమాచారాన్ని సేకరించి, చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది.

ఉరిశిక్ష ప్రభావం గురించి అధ్యయనం చేసే నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణిని సుప్రీం కోర్టు కోరింది. ఈ అంశంపై నిపుణుల కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సుప్రీం కోర్టు తెలియజేసింది. మరణశిక్ష పడ్డ వాళ్లకు నొప్పి లేకుండా చావును ఇవ్వాలన్న అంశంపై దాఖలైన పిటిషన్ విచారణ నేపథ్యంలో కోర్టు ఈ అంశాన్ని పేర్కొంది. ఉరికి బదులుగా తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం, ఎలెక్ట్రిక్ షాక్ లాంటి పద్ధతులను అమలు చేయాలంటూ పిటిషన్‌లో సూచించారు. మెడకు ఉరి వేసి చంపడం అనేది చాలా క్రూరమైన పద్ధతి అని లా కమీషన్ లాయర్ రిషి మల్హోత్రా తెలిపారు.

ఇది చాలా ఆలోచించాల్సిన అంశమని, కానీ దీనిపై సైంటిఫిక్ డేటా అవసరమని, నొప్పుల గురించి అధ్యయనం చేసి డేటా ఇవ్వాలని, త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామని సీజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు. ఈ కేసు విచారణ మే 2 కు వాయిదా వేస్తున్నట్టు ఆయన చెప్పారు. విచారణ సమయంలో వివిధ రకాల మరణాల గురించి జడ్జీలు చర్చించారు. ఉరి తీయడాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటిస్తే, అప్పుడు ఇతర పద్ధతుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News