హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రేవతి క్లాప్‌నివ్వగా వైష్ణవి కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి వంశీ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ “ఇది నా 52వ చిత్రం. తెలుగులో మరో మంచి సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో స్వేచ్ఛ స్వాతంత్య్రాలు కలిగిన శృతి అనే యువతిగా కనిపిస్తా. ఆద్యంతం మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది”అని తెలిపారు. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ “ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెబుతుంటారు.
అలాగే ప్రతి మహిళ సంఘర్షణ వెనుక కూడా ఒక మగాడు ఉంటాడు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణను ఓ యువతి ఎలా ఎదుర్కొన్నదన్నది ఈ చిత్ర ఇతివృత్తం. అయితే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ సోమవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ నెలాఖరున సెకండ్ షెడ్యూల్, ఆగస్టులో మూడో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం”అని చెప్పారు. మురళీ శర్మ, ఆర్.నారేయనన్, జయప్రకాష్, వినోదిని, సాయితేజ, పూజారామచంద్రన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః కిశోర్ బోయిడపు, సంగీతంః మార్క్ కె.రాబిన్.
Hansika’s ‘My Name Is Shruti’ movie launched in Hyd