Friday, December 20, 2024

సంతోషమే సంపూర్ణ బలం

- Advertisement -
- Advertisement -

‘సంతోషమే సగం బలం’ అన్నారు వెనుకటికి మన పెద్దలు. మారిన ఆధునిక ప్రపంచ పోకడల పరిస్థితుల్లో పైనానుడిని మార్చుకోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. “సంతోషమే సంపూర్ణ బలం” అని చెప్పుకోవడమే కాకుండా ఆచరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధునికత పెరిగే కొద్దీ సంతోషం స్థానంలో ఒత్తిడి, మానసిక కుంగుబాటు, నైరాశ్యం లాంటి అవలక్షణాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ‘సంతోష’ ర్యాంకింగ్‌లో కూడా భారత దేశం వెనుకబడుతున్నదని మరోసారి రుజువైంది. అత్యంత సంతోషభరిత దేశాల్లో భారత దేశం పొరుగున వున్న చైనా, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్‌ల కన్నా మనం దిగదుడుపుగా వున్నామంటే మన దేశ పరిస్థితులు ఎలా వున్నాయో విశదీకరించనక్కర లేదు. ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది ప్రపంచం సంతోష దినోత్సవంగా జరుపుకునే మార్చి 20న సంతోష దేశాల ర్యాంకింగ్‌ను ప్రకటిస్తుంది. ఈ దఫా ఐక్యరాజ్యసమితి 143 దేశాల ప్రజల మనోగతాలను తెలుసుకొని ర్యాంకులను ప్రకటిస్తే ఇందులో భారత దేశం 126వ స్థానంలో నిలువగా,

అధిక జనాభా వున్న చైనా 60, నేపాల్ 93, పాకిస్తాన్ 108, మయన్మార్ 118 ర్యాంకుల్లో వున్నాయని తేలింది. వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ సంతోష ర్యాంకింగ్‌లో అగ్రస్థానం మరోసారి దక్కించుకోవడం విశేషంగా చెప్పవచ్చు. తాలిబన్ల పాలనలో క్షణమొక నరకంగా బతుకులీడుస్తున్న అఫ్ఘానిస్తాన్ ర్యాంకింగ్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. వరుసగా ఏడోసారి అగ్రస్థానం ఘనతను సాధించుకున్న ఫిన్లాండ్ ఉత్తర యూరపులో ఒక చిన్న దేశం. ఇక్కడ జనాభా 55 లక్షలే. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలు, అశాంతిలేని ఆహ్లాదకర జీవితాలను అనుభవిస్తున్నారని అందుకే ఇక్కడి ప్రజల ఆయుర్దాయం 81.27 ఏళ్లకు పెరిగిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. తొమ్మిది ప్రమాణాల ప్రాతిపదికన సమితి సంతోషకర దేశాల జాబితాను నిర్ధారిస్తుంది. ముఖ్యంగా దేశ జిడిపి, ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం, అందుబాటులో ఆరోగ్యం, విద్య, స్వేచ్ఛ, ప్రజాస్వామిక హక్కులు, ప్రజాస్వామ్య పాలన, పౌర హక్కులు లాంటి అంశాలను పరిశీలించి, విశ్లేషించి ర్యాంకింగ్‌లను సాధికారికంగా ప్రకటిస్తారు.

ఈ అంశాల్లో ఫిన్లాండ్ వరుసగా ఏడోసారి అగ్ర ర్యాంకింగ్ ఘనతను సాధించడం సాధారణ విషయం కాదు. ఈ దేశం చిన్నదే అయినా ఇక్కడ లక్షా 88 వేల సరస్సులున్నాయనడం అతిశయోక్తి కాదు. నిజం. అంతకు మించి 40 దాకా జీవవైవిధ్యాన్ని ప్రతిబింబించే జాతీయ పార్కులున్నాయి. ఫిన్లాండ్ రాజధాని హెల్సింక్‌కి కూతవేటు దూరంలోనే దట్టమైన అడవులు ఉన్నాయి. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ప్రకృతిలో ఇక్కడి ప్రజలు దైనందిన ఒత్తిడుల నుంచి సేదదీరుతూ పరవశిస్తుంటారు. నేరాలు, ఘోరాలు ఇక్కడ అరుదు. స్వేచ్ఛ, సామాజిక భద్రత అపరిమితం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంపూర్ణ విశ్వాసం ఈ దేశ సొంతం. పౌర స్పృహ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా ఇక్కడ వుంటుంది. పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నివారణ, నిర్వహణలో ఆధునిక విధానాలు ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. రోడ్లు, ప్రజా రవాణా, ఆహారం లాంటి విషయాల్లో కూడా ఇక్కడ ఆదర్శ విధానాలు అమలవుతున్నాయి. ప్రజలు ఇంటి నుంచి లేదా పని ప్రదేశం నుంచి బయటకు వస్తే ఆహ్లాదకర వాతావరణమే తప్ప ఎక్కడా కల్లోల వాతావరణం కనిపించదు.

పరిశుభ్రమైన నీరే కాకుండా గాలి కూడా కలుషితం కాని స్వచ్ఛ విధానాలు అమలు చేస్తుండడంతో ప్రజల ఆరోగ్యాలు కూడా అత్యున్నతంగా వుంటాయి. అన్నిటికీ మించి పాలనలో అవినీతి కనిపించదు. పౌర సేవలన్నీ నిజాయితీగా అందరికీ అందుబాటులో ఉంటాయి. పగలైనా, రాత్రి అయినా ఇక్కడ భద్రతకు ఢోకా వుండదు. మహిళల రక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఇతర దేశాల మాదిరిగా ఇక్కడ అనిశ్చిత రాజకీయ వాతావరణం కనిపించదు. ఎవరి పని వారు ప్రశాంతంగా చేసుకుంటూ పోవడంతోనే సంతోషభరిత దేశంగా ఫిన్లాండ్ నిలుస్తున్నదని అక్కడి పౌరులు గర్వంగా చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితులు భారత దేశంలో ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజల్లో జవాబుదారీతనం, క్రమశిక్షణ, పౌరస్పృహ ఇతరులను గౌరవంగా చూసే విశాల దృక్పథం వస్తే తప్ప సంతోషకర ర్యాంకింగ్‌లో మనం మొదటి స్థానం కాకున్నా మొదటి 30 స్థానాలకైనా ఎదగగలం. దానికి కావాల్సింది అందరిలో సామాజిక నిబద్ధత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News