Monday, December 23, 2024

ఘనంగా సుపరిపాలన దినోత్సవం

- Advertisement -
- Advertisement -

జనగామ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అధ్యక్షతన సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ జిల్లా పుర ప్రముఖులు హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత పరిపాలన సౌలభ్యం సులభతరమైందని, త్వరితగతిన ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందని, జిల్లాలో నూతన కలెక్టరేట్ల భవనాల నిర్మాణం, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుపరుస్తుందన్నారు.

భూ సమస్యల పరిష్కారం, వ్యవసాయం, సాగు, తాగునీరు, వైద్యారోగ్య, ప్రతి శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రజలకు సులభంగా సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈసుపరిపాలన మరింత వేగంగా ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానం ద్వారా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సుపరిపాలన అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచన విధానం ద్వారా ప్రభుత్వ శాఖల ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని, అందులో భాగంగా కేంద్రం నుంచి అనేక జాతీయ స్థాయి అవార్డులు తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలకు వచ్చాయని, అందులో ఉద్యోగులు కీలక పాత్ర వహించారని గుర్తుకు చేశారు.

మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు జనగామ జిల్లా కరువు జిల్లాగా విలయతాండవం చేసేదని, తాగునీరుకు, సాగునీరుకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి పరిపాలనలో ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి గుంటకు సాగునీరు అందించడం జరుగుతుందని, రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ లాభాల దిశగా పయనించిందని, అత్యధికంగా వరిధాన్యం పండించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తుందని గుర్తుకు చేశారు. తెలంగాణ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులంతా భాగస్వాములు కావాలని, ప్రతిపౌరుడికి సంక్షేమ ఫలాలు అందే విధంగా పనిచేయాలని, సమస్య ఎక్కడ ఉందో గుర్తించి ఎవరి స్థాయిలో వారు సమస్యను పరిష్కరించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవం జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, జిల్లా యంత్రాంగం వారి ద్వారా పనిచేసిన శాఖల ప్రగతి నివేదికలు అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయని కలెక్టర్‌కి యంత్రాంగానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథుల, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, పేరిణి సంతోష్ బృందంచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతిశాఖ నుంచి వారి ప్రగతి నివేదికలు సమర్పించి ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఈ సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్‌సింగ్, వ్యవసాయశాఖ అధికారి వినోద్‌కుమార్, డీఆర్‌డీవో ప్రాజెక్టు డైరెక్టర్ రాంరెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి ఇస్మాయిల్, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News