ప్రతి రోజూ మహిళాదినోత్సవమే!
మహిళా మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను మనల్ని కానీ మన శక్తిసామర్థ్యాలను కానీ గుర్తించడానికి ప్రత్యేకించి ఒక రోజు కావాలా! భరించలేనంతటి పురిటి నెప్పులు అని తెలిసినా, నవమాసాలు కడుపులో బిడ్డను మోస్తున్నప్పుడు రకరకాల ఇబ్బందులను ఎదర్కోవలసి వచ్చినా, పుట్టిన బిడ్డను చూసిన క్షణంలోనే మరిచిపోయి బిడ్డను దగ్గరకు తీసుకుంటుందే ఆ క్షణంలో ఓ స్త్రీలోని శక్తిని చూడొచ్చు. పుట్టిన క్షణం నుంచీ కంటికి రెప్పలా కాపాడుతూ, విద్యాబుద్ధులే కాదు జీవిత పాఠాలను నేర్పేటప్పుడు, బుడిబుడి నడకలప్పుడు వేసే తప్పటడుగుల్నే కాదు జీవితంలోనూ తప్పటడుగులు వేయకుండా చూసుకునే ఓర్పు నేర్పు చూపినప్పుడు ఆ స్త్రీ మూర్తిలోని సామర్థ్యం చూసి ఔరా అని అభినందించకుండా ఉండగలరా.
అమ్మకు చేదోడు వాదోడుగా ఉన్నా, తండ్రికి మరో అమ్మలా మారి ప్రేమను చూపించినా, తోబుట్టువుగా తన తోడబుట్టిన వారికి ప్రేమాభిమానాలు పంచినా అది స్త్రీ మూర్తికే చెల్లింది.
ఆలిగా ఇంకో ఇంట కాలు పెట్టినా, అది తన సొంతం చేసుకుని అన్నీ తానై, పూమాలలోని దారంలా తానే ఓ దారంలా మారి అందరినీ అనుసంధానం చేస్తున్నప్పుడు ఆ స్త్రీ మూర్తిలోని సహనశీలత, ప్రేమానురాగాలను చూసి చప్పట్లు చరవాల్సిందే. తను పని చేస్తున చోటు అయినా తనే నలుగురికీ ఉపాధిని కలిపించిన చోటు అయినా, ధర్మబద్ధంగా, నీతీ నిజాయితీగా మెలిగేటప్పుడు తనలో నిబిడి ఉన్న నైపుణ్యాలను చూసి మెచ్చుకు తీరాల్సిందే. అంతెందుకు జీవితంలో వచ్చే ప్రతి మలుపునూ హుందాగా స్వీకరించి ముందుకు సాగే గుణం ప్రతి స్త్రీమూర్తికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే అంటున్నాను ‘మహిళా దినోత్సవం’ అంటూ ప్రత్యేకించి ఒక్క రోజు చేసుకోనక్కర లేదు. ప్రతిరోజూ మహిళా దినోత్సవమే. అలాంటి స్త్రీమూర్తి కంటకన్నీరు రానీయకండి. ఎందుకంటే కలకంటి కంట కన్నీరోలికిన తొదవురా సిరులు… యుద్ధనపూడి ఉషారాణి
అనాదిగా వస్తున్న బంధనాల్ని ఒక్కొక్కటిగా విదుల్చుకొని అంతరిక్షం దాకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అన్ని రంగాల్లో తమదైన ముద్రతో రాణిస్తున్న నడుస్తున్న చరిత్ర స్త్రీలది. స్త్రీశక్తి ముందు ఏ శక్తి నిలువజాలదని ప్రతిభ ఎవరి సొత్తుకాదని ప్రతిభకు కుల, మత, లింగ, వివక్షలు అడ్డు రావని నిరూపితమవుతున్న కాలమిది. ఆటోడ్రైవర్ నుండి అంతరిక్ష వ్యోమగామి వరకు, గృహిణి నుండి రాష్ట్రపతి వరకు మేము ఏదైనా విజయవంతంగా నడపగలమని ప్రపంచానికి చాటిచెబుతున్న సందర్భంలో తెలంగాణ మహిళా శక్తి కూడా అజేయంగా నిలుస్తున్నది.
రాణి రుద్రమ్మ, సమ్మక్క సారక్కల నుండి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం దాకా లాఠీలకు, రబ్బరు బుల్లెట్లకు వెరవని ధైర్యం, తమ ప్రాణార్పణతో ఉద్యమ జ్యోతిని వెలిగించిన త్యాగం తెలంగాణ మహిళలది. మలిదశ తెలంగాణ పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రామంలో ఉండే ఉన్నత పాఠశాల దాకా విద్యార్థినీ లోకం ఒక్కటై తెలంగాణ కోసం కొట్లాడింది. బతుకమ్మ ఆట నుండి మొదలు రోడ్డు మీద వంటావార్పు దాకా ప్రతీ సందర్భంలో తమ ఆకాంక్షను చాటింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనాదిగా మహిళలు పడుతున్న కష్టాల్ని దూరంచేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేశారు కెసిఆర్. తెలంగాణ రాకముందు మహిళలు తాగునీటి కోసం పడ్డ గోస వర్ణనాతీతం. కిలోమీటర్ల దూరం నుండి బోరు బావుల వద్దనుండి మోసీ మోసి భుజాలు, బోరింగులు కొట్టీ కొట్టి చేతులు పోయిన దైన్యం తెలంగాణ మహిళలది. ప్రభుత్వం నీటి సరఫరాపై సరైన దృష్టి సారించక కరంటుకోసం బోర్ల దగ్గర, ట్యాంకర్లకోసం వీధుల్లో మహిళలు యుద్ధాలు చేసిన ఘటనలు ఉన్నాయి.
కొన్ని గ్రామాల్లో అయితే నీళ్ల కష్టంచూసి తమ బిడ్డ ఈ కష్టాలు పడవద్దని పిల్లను కూడా ఇవ్వని ఊర్లు తెలంగాణలో ఉండే. పిల్లల్ని మంచం మీద నిలబెట్టి స్నానం చేయించి కింద పట్టిన నీళ్లను మళ్ళీ తిరిగి వాడుకున్న దుస్థితి తెలంగాణది. ఫ్లోరోసిస్ ప్రభావంతో నల్లగొండ జిల్లాలో తాము కన్న పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగక అవిటి వాళ్లుగా మారిపోతుంటే, వారిని విడిచి కూలిపనికి వెళ్లలేక తాళ్లతో మంచానికి కట్టి నాలుగు మెతుకులకోసం కూలికి వెళ్లిన దుఃఖం తెలంగాణ మహిళలది. కానీ తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ మహిళల తాగునీటి కష్టాల్ని తీర్చే విధంగా మిషన్ భగీరథ పథకంతో మారుమూల తండా, గూడెం నుండి మహానగరం దాక అన్ని గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గోదావరి, కృష్ణా జలాలను తమ ముంగిట్లో ఇంటింటికీ నల్లాద్వారా తాగునీరు కెసిఆర్ అందించారు. ఇవ్వాళ ఈ ప్రభుత్వానికి సరిఅయిన ముందుచూపు లేకపోవడం వల్ల తిరిగి తాగునీటికి కూడా తల్లడిల్లె పరిస్థితులు గ్రామాల్లో పట్టణాల్లో నెలకొంటున్నాయి. తెలంగాణ వచ్చాక ఈ రాష్ట్రానికి బలమైన పునాది వేయాలని సంకల్పించి కెసిఆర్ అమలు చేసిన అనేక పథకాలలో కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే కాకుండా వాటివెనుక నిగూఢమైన సామాజిక దృక్పథం దాగి ఉంది.
కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల చదువును ప్రోత్సహిస్తూ బాలికల గురుకులాలను విస్తృతంగా ఏర్పాటు చేయడం, ప్రభుత్వ విద్యను అన్నిస్థాయిల్లో అందుబాటులో ఉంచడం వల్ల తెలంగాణ బాలికలు తమ ప్రతిభను చాటి ఉన్నతంగా కీర్తించబడ్డారు. అంగన్వాడీలనుండి మొదలుపెడితే ఆడపిల్లలకు బలమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని కెసిఆర్ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లను కూడా అందించారు. బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలను ప్రతి నియోజకవర్గంలో అందుబాటులోకి తేవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరంగా ఉన్న పేద కుటుంబాల పిల్లలు ఇవ్వాళ తమ ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా చాటే అవకాశం లభించింది. ఎక్కడో మారుమూల గూడెంలోని మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరం మీద తెలంగాణ కీర్తిపతాకాన్ని ఎగురవేసే ధైర్యాన్ని విశ్వాసాన్ని కెసిఆర్ ప్రభుత్వం నింపగలిగింది. కానీ నేడు అదే గురుకులాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఎలుకలు, పాములు కరిచి మరణించే పరిస్థితికి దిగజార్చారు. కడుపునిండా సన్నబియ్యంతో అన్నంపెట్టి కెసిఆర్ గురుకుల విద్యార్థులను సాధుకుంటే నేటి పాలకులు విషహారంతో ఆసుపత్రులకు పంపుతూ అర్ధాకలితో పస్తులుంచే పరిస్థితికి తీసుకొచ్చారు. గురుకులం అంటేనే బెదిరిపోయే స్థితికి వాటి నిర్వహణను దిగజార్చారు.
కెసిఆర్ తెలంగాణ సమాజం మీద తనకున్న విశేషమైన అవగాహనతో సమాజంలోని అనేక రుగ్మతలను రూపుమాపే దిశగా అలోచించి పథకాలను రూపొందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక లంబాడీ తండాలో సర్వస్వం అగ్నిప్రమాదంలో కోల్పోయిన గిరిజన కుటుంబం పెళ్లికి పడుతున్న కష్టం కళ్లారా చూసిన కెసిఆర్ మదిలో కళ్యాణాలక్ష్మి పథకం రూపుదిద్దుకుంది. ఆడపిల్ల ఎదుగుతుంటే ఎక్కడ తమ మీద పెళ్లి భారం పడుతుందో అని భావించిన పేద తల్లిదండ్రులకు కళ్యాణాలక్ష్మి పథకం కొండంత ధైర్యాన్ని కల్పించింది. దాదాపు 12 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం సహాయం చేయడమనేది గొప్ప విషయం. ప్రభుత్వ సహాయానికి కులం మతం అనే అడ్డుగోడలు ఉండకూడదని దళిత పేద ఆడపిల్లలతో ప్రారంభించిన ఈ పథకం దశలవారీగా అన్ని కులాలలోని పేదలకు , షాదీముబారక్ పేరుతో మైనారిటీ పేద ఆడపిల్లలకు అన్నితానై పెళ్లి భారం కాకుండా పేద తల్లిదండ్రుల భారాన్ని ప్రభుత్వం పంచుకుంది. 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మిరాదని పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న సంఘటనలు గ్రామాల్లో కనపడ్డాయి.
కళ్యాణలక్ష్మి పేద తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని, పెళ్లి కారణంగా తమ విలువైన చదువును, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడంతో వచ్చే ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందే అవకాశం కల్పించింది. పెళ్లి కట్నకానుకలకే కాదు. 18 సంవత్సరాలు నిండేదాకా చదివించాలనే గొప్ప సామాజిక విలువను తెలంగాణలో నెలకొల్పిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ కెసిఆర్ ఇస్తున్న కల్యాణలక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్ళ్ళై ఏడాది గడిచినా కనీసం కెసిఆర్ ఇచ్చిన సహాయాన్ని కూడా అందించకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ పదిహేను నెలల కాలంలో లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులు కళ్ళల్లో ఒత్తులేసుకొని కల్యాణలక్ష్మి సహాయం కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఒక్క పెళ్ళికే కాదు ప్ళ్ళైన సంవత్సరంలో బిడ్డ కాన్పు ఎలా చేయాలనే కష్టాన్ని కూడా కెసిఆర్ గుర్తించి గర్భవతిగా ధ్రువీకరించిన క్షణం నుండి వారికి అన్నిరకాల సలహాలు, సూచనలూ ఇస్తూ రెగ్యులర్ చెకప్ చేస్తూ బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి ఆరోగ్య లక్ష్మి పేరుతో అంగన్వాడీ సెంటర్లలో పౌష్టిక ఆహారం అందించడంతో పాటు రక్తహీనత ఉన్న మహిళలకు డెలివరీ సమయంలో ఇబ్బందులు లేకుండా న్యూట్రిషన్ కిట్లను కూడా గతంలో అందిచింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించే ప్రతీ ఆడబిడ్డకు డెలివరీ చేసి కెసిఆర్ కిట్‌రూపంలో ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ. 12 వేలు వారి అకౌంట్లలో వేసి తల్లిబిడ్డకు కావాల్సిన ఉపకరణాలు ఇచ్చి ప్రభుత్వ వాహనంలో క్షేమంగా ఇంటి దగ్గర దించివచ్చే విధంగా కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కెసిఆర్ కిట్ వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించి డెలివరీలు చేయడం వల్ల ఒక్క డెలివరీకి దాదాపు 20 నుండి 30 వేల రూపాయలు ప్రయివేటు ఆసుపత్రుల్లో ధారబోసే పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. 2014కు ముందు రెండంకెల సంఖ్యను కూడా దాటని ప్రభుత్వ ఆసుపత్రులో ప్రసవాలు ఒక్కో ఆసుపత్రిలో నెలకు 300 నుండి 400 వరకు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచి ఇటు ప్రయివేటు ఆసుపత్రిలో ఆర్థిక దోపిడీతోపాటు పేద ఆడపిల్లలు అనవసర ఆపరేషన్ల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. అదే విధంగా మహిళల ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైన దృష్టితో ప్రతి మంగళవారం మహిళలకు అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సత్వరమే వారికి చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కెసిఆర్ ప్రభుత్వం కృషి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కెసిఆర్ కిట్ పథకాన్ని ఆపివేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల సేవల నిర్వహణను గాలికొదిలింది. ఫలితంగా నేడు పేద ఆడబిడ్డలు కూడా డెలివరీ కోసం మళ్ళీ ప్రయివేట్ ఆసుపత్రుల బాట పట్టే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తుంది.
విధి వక్రీకరించి భర్తలకు దూరమై తమ కుటుంబాల పోషణా బాధ్యతల్ని మోస్తున్న తల్లుల కుటుంబాల భారాన్ని పంచుకొని వారికి ఆసరాగా నిలవాలని కెసిఆర్ గొప్ప మనసుతో ఆలోచించి వారందరికీ నెలనెలా వారి అకౌంట్లలో 2016, 3016 రూపాయల పెన్షన్ వేస్తూ వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు మరొకరికి భారం కాకుండా కుటుంబంలో, సమాజంలో వారూ ఆత్మగౌరవంతో జీవించే విధంగా చేసింది. పెన్షన్ వల్ల వారి కుటుంబాలలో గౌరవాన్ని ప్రేమను పొందే పరిస్థితి కెసిఆర్ కల్పిస్తే, తాము అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4 వేలు, వికలాంగులకు రూ. 6 వేలు ఇస్తామని చెప్పి ఓట్లయించుకున్న సిఎం రేవంత్ రెడ్డి పెన్షన్ డబుల్ చేయడం అంటుంచి పదనాలుగు నెలల్లో రెండు నెలల పెన్షన్ ఎగొట్టి నిరుపేద వితంతువుల నోటికాడి బుక్కను లాక్కున్నారు. రైతుబంధు పథకంతో భూమి ఉన్న తెలంగాణలోని ప్రతి మహిళా రైతు అకౌంట్లో ఎకరాకు 5 వేల రూపాయలు వేయడంతో మహిళల అకౌంట్లలో కూడా డబ్బులుండే పరిస్థితి తెలంగాణలో వచ్చింది.
సమైక్య రాష్ట్రంలో బతుకు మీదనే ఆశ కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కనీసం అండగా నిలవని రోజునుండి దురదృష్టవశాత్తు రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబ భారాన్ని మోసే తల్లులకు ఎంతో కొంత స్వాంతన చేకూర్చాలని రైతు మరణించిన పది రోజుల్లోపు వారి కుటుంబసభ్యుల అకౌంట్లలో 5 లక్షల రూపాయలు వేసి అండగా నిలిచారు కెసిఆర్. ఇప్పుడైతే పది వేలు మేము వచ్చాక పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును కూడా బంద్ పెట్టింది. పోయిన వానాకాలం రైతుబంధు సహాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టింది. యాసంగి పంట పొట్టకొచ్చినా ఇంకా రైతుల అకౌంట్లలో రైతుబంధు డబ్బులు జమ చేసేందుకు ఆపసోపాలు పడుతూనే ఉంది. కెసిఆర్ హయాంలో కూడా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు విశేషంగా కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వం. వడ్డీ లేని రుణాలను రూ. 10 లక్షల వరకు అందిస్తూ, గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు స్త్రీనిధి ద్వారా నిధులు సమకూరుస్తూ ఆర్థికంగా మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు సంపూర్ణ సహకారం అందించారు. కోటి మంది మహిళల్ని కోటిశ్వరుల్ని చేస్తానంటున్న రేవంతన్న మాటలు కోటలు దాటుతున్న ఆచరణ మాత్రం గడపదాటడం లేదు. కలర్ పేజీ ప్రకటనల్లో ఉన్న స్పష్టత పథకాల అమలులో ఉండడం లేదు.
మహిళలకు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను, తోడ్పాటునైనా ఇవ్వకుండానే కోటీశ్వరులను చేస్తా అనే భ్రమను కల్పించి మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడం ఏమో గాని ఆటో కార్మికులు, గిరాకీ లేక చిరువ్యాపారులు, రియల్ ఎస్టేట్ కుదేలవడంతో తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేక మధ్యతరగతి ప్రజలు, దినదినం సంక్షోభంలోకి వెళ్తుండడంతో అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుందడంతో మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెగుతున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, దాడులకు అడ్డుకట్ట వేసేందుకు గత కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంతో స్ఫూర్తిదాయకం. తెలంగాణలో ఒకవైపు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ మరోవైపు ప్రజలతో ఫ్రెండ్లీగా సేవలందించే విధంగా మానవీయ విలువల్ని పెంపొందించే విధంగా తీర్చిదిద్దారు. ప్రత్యేకించి మహిళల రక్షణకు షీ టీంలను ఏర్పాటు చేసి ఆకతాయిలపై నిఘా పెడుతూ మహిళలను కంటికి రెప్పలా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఈ పదిహేను నెలల కాలంలో మహిళల మీద అకృత్యాలు, దారుణాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో భద్రత కరువై క్రైమ్ రేట్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అందించి, మహాలక్ష్మి గ్యారంటీని మరిచిపోతున్నది. మహిళల అకౌంట్లలో నేరుగా 2500 రూపాయలు వేస్తామని చెప్పిన ప్రభుత్వం పదనాలుగు నెలలు గడుస్తున్నా పదిపైసల సహాయం విదల్చలేదు. గత ప్రభుత్వం అందించిన కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను బంద్ పెట్టి మహిళలకు అన్యాయం చేస్తున్నారు.
గ్యాస్ సబ్సిడీ అని మురిపించి సగం మందికి కూడా అందివ్వడం లేదు. ఆరు గ్యారంటీల పేరుతో మనలో గ్యాస్ నింపి ఏమార్చారే తప్ప అమలు చేస్తారనే గ్యారంటీ మాత్రం ఎక్కడా కనబడడం లేదు. మార్పు పేరుతో, ప్రజాపాలన పేరుతో అధికారంలోకివచ్చిన కాంగ్రెస్ సర్కారు మాటలతో ఏమార్చడం తప్ప ఏ మార్పు చేతల్లో కన్పిస్తలేదు. కుత్సిత బుద్ధితో కుర్చీల కొట్లాట తప్ప కూలుతున్న మన బతుకులకు భరోసా దొరకడం లేదు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అడ్డమైన మాటలతో కాలం గడుపుతుంది. గత ప్రభుత్వంపై పొద్దుపోవడం తప్ప మన బతుకుల్లో కొత్త వెలుగులు నింపుతారనే ఆశ నిరాశగానే మిగిలిపోయేలా ఉంది. మంటికైనా ఇంటోడుండాలని మన పెద్దలు చెప్పినట్టు తల్లి గారింటి ఆప్యాయతను అనురాగాన్ని పంచి కన్నబిడ్డలోలె కంటికి రెప్పలా సాదుకున్న కెసిఆర్ బాపుకు మళ్ళీ ఆడబిడ్డలమందరం అండగా నిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిని ప్రపంచానికి చాటేలా పనిచేసిన చేతులకు బలాన్ని ఇచ్చి దేశానికే తలమానికమైన మన తెలంగాణను మనం కాపాడుకుందాం.
మహిళా శక్తిని భారత దేశ అభివృద్ధికై జోడిద్దాం…
ప్రపంచంలో మేటిగా భారత దేశాన్ని నిలుపుదాం…
మాదాసు అన్నపూర్ణ