Monday, December 23, 2024

ఘనంగా తెలంగాణ సాహిత్య దినోత్సవం

- Advertisement -
- Advertisement -
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సాహితీకారుల పాత్ర కీలకం
  • జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కవులు, సాహితీ వేత్తలు, కళాకారుల పాత్ర కీలకమైనదని జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెలంగాణ సాహిత్య దినోత్సవంను సంగారెడ్డిలో నిర్వహించారు. తెలంగాణ సాహిత్య దినోత్సవ వేడుకలకు జిల్లా నలు మూలల నుండి కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ కవితలతో తెలంగాణ ఔన్నత్యాన్ని, ప్రగతిని చాటి చెప్పారు. తెలంగాణ వచ్చాక ప్రజల జీవితాల్లో వచ్చిన వెలుగులను, ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తీరును, అమలవుతున్న సంక్షేమ సౌరభాలను, మారిన తెలంగాణ ముఖచిత్రాన్ని తమ కవితలలో వినిపించారు.

ముందుగా 17వ శతాబ్ది కి చెందిన సంగారెడ్డి జిల్లా కవి పొన్నగంటి తెలగన చిత్రపటానికి జెడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ శరత్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కవులను స్మరించి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సాహిత్య దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికి శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, రూ. 1,116 నగదు పారితోషకంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంజుశ్రీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోరాట ఉద్యమంలో సాహితీ కారుల పాత్ర అమోఘమైనదని అన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం కవులు, కళాకారులు రచయితలు, సాహితివేత్తలకు సమున్నత గౌరవం ఇస్తుందన్నారు. దశాబ్ది ఉత్సవాలలో సాహిత్య దినోత్సవాన్ని జరుపుకుంటూ వారికి సమున్నత గౌరవం ఇస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ కవులు తమ కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేస్తారని, వారి కవితలు రచనలు, పాటల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చారని, తెలంగాణ ఉద్యమంలో కవులు కీలక భూమిక పోషించారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సమాజ హితం కోసం, రాష్ట్ర అభివృద్ధికి కవుల కవితలు దారి చూపేలా ఉండాలన్నారు. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కవులు తమ గొప్ప సాహిత్యంతో ప్రతి ఒక్కరిని చైతన్యవంతులని చేశారన్నారు.

కవులను గౌరవించే చరిత్ర మన సిఎందన్నారు. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి కవులను కళాకారులను గౌరవించడం సిఎంకు ఎనలేని ప్రీతి అని అన్నారు. తెలంగాణ ఖ్యాతిని, ఔన్నత్యాన్ని కవితల ద్వారా చాటుదామన్నారు. కవి సమ్మేళనం లో 62 మంది కవులు పాల్గొన్నారు. జిల్లా డెయిరీ శాఖ వారి ఆధ్వర్యంలో రూపొందించిన సిడిని అతిథిల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిఆర్‌ఓ నగేష్, డిఈఓ వెంకటేశ్వర్లు, డిఐఓ గోవిందరామ్, యువజన సంక్షేమ అధికారి రామచందర్ రావు, డిసిఒ తుమ్మ ప్రసాద్, జిల్లా డెయిరీ అధికారి మురళి, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్,ఆర్‌డిఓ రవీందర్ రెడ్డి, పిఎంకె గాంధీ, మహిపాల్ రెడ్డి, కవులు, కవయిత్రులు, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News