మనతెలంగాణ, హైదరాబాద్ : ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఖాతా క్రియేట్ చేసి యువతిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌కు చెందిన తుము భరత్‌కుమార్ డిగ్రీ చేస్తున్నాడు. భరత్‌కుమార్ గతకొంత కాలం నుంచి పోర్న్ వీడియోలు చూస్తూ బానిసగా మారాడు. ఆ వెబ్‌సైట్లను కేంద్రం బ్యాన్ చేసింది. విపిఎన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నాడు.
తర్వాత కొన్ని రోజులకు కాల్‌బాయ్‌గా లొకాంటో, స్కోకా యాప్‌ల్లో నమోదు చేసుకుని, కాంటాక్ట్ నంబర్ ఇచ్చాడు. సరిగా స్పందన రాకపోవడంతో ఇన్‌స్టాగ్రాంలో వివిధ నంబర్లను సెర్చ్ చేసి ఓ బాధితురాలితో ఛాటింగ్ చేస్తున్నాడు. తర్వాత బాధితురాలి పర్సనల్ డిటేయిల్స్ తీసుకున్నాడు. నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతా ఏర్పాటు చేసి బాధితురాలి ఫొటోలు అసభ్యంగా పొస్టింగ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.