అన్ని ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భజ్జీ
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని హర్భజన్ శుక్రవారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన హర్భజన్ టీమిండియా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. తన అసాధారణ స్పిన్ బౌలింగ్‌తో ఎన్నో టెస్టులు, వన్డేల్లో భారత్‌కు చారిత్రక విజయాలు సాధించి పెట్టాడు. అనిల్ కుంబ్లే తర్వాత భారత్‌లో రెండో అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరుతెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల చేరికతో హర్భజన్ పూర్తిగా వెనుకబడి పోయాడు. కాగా, 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో హర్భజన్ 103 టెస్టులు, మరో 236 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అంతేగాక టీమిండియా తరఫున 28 అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో హర్భజన్ నాలుగో స్థానంలో నిలిచాడు. హర్భజన్ 417 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక వన్డేల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ ఫార్మాట్‌లో 269 వికెట్లను పడగొట్టాడు.
మరోవైపు టి20లలో 25 వికెట్ల తీశాడు. ఇక మూడు ఫార్మాట్‌లలో కలిపి 3,500కు పైగా పరుగులు సాధించాడు. దీంతో పాటు ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. పలువురు యువ స్పిన్నర్ల చేరికతో హర్భజన్‌కు జట్టులో స్థానం కోల్పోయాడు. సుదీర్ఘ కాలంగా అతనికి టీమిండియాలో చోటు దక్కడం లేదు. అతను రిటైర్మెంట్ ప్రకటించకున్న అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎప్పుడో ముగిసి పోయిందనే చెప్పాలి. హర్భజన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2016లో ఆడాడు. అప్పటి నుంచి అతనికి ఒక్కసారి కూడా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రాలేదు. అయితే ఏదో ఒక సమయంలో అవకాశం రాకపోతుందా అని ఎంతో ఆశతో ఎదురు చూశాడు. అయితే రవీంద్ర జడేజా, అశ్విన్‌లను కాదని అతనికి టీమిండియాలో స్థానం కల్పించేందుకు సెలెక్టర్లు ఆసక్తి చూపించలేదు. దీంతో శుక్రవారం హర్భజన్ అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు వెల్లడించాడు.
టర్బోనేటర్‌గా గుర్తింపు..
భారత్‌కు లభించిన అత్యుత్తమ స్పిన్నర్లలో హర్భజన్ ఒకడు. టర్బోనేటర్‌గా పేరు తెచ్చుకున్న హర్భజన్ మరో భారత దిగ్గజం అనిల్ కుంబ్లేతో కలిసి టెస్టుల్లో, వన్డేల్లో టీమిండియాకు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు. వీరిద్దరూ దాదాపు 15 ఏళ్ల పాటు భారత స్పిన్ బౌలింగ్ భారాన్ని మోశారు. ఇక హర్భజన్ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాలో హర్భజన్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక సగటు అభిమాని అతన్ని భజ్జీ, టర్బోనేటర్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
హర్భజన్ సింగ్ పేరు పలకడానికి ఇబ్బందిగా కనిపించడంతో భారత మాజీ క్రికెటర్ నయన్ మోంగియా అతనికి భజ్జీ అని పేరు పెట్టాడు. భజ్జీ అనే పేరుతోనే హర్భజన్ ఫేమస్ అయ్యాడు. ఇదిలావుండగా ఈ పేరుపై 2009లో హర్భజన్ పేటెంట్ హక్కు కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం భజ్జీ పేరుతోనే హర్భజన్ ఓ స్పోర్ట్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా, 2011 బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో హర్భజన్ అత్యుత్తమ ప్రదర్శ చేశాడు. ఈ సిరీస్‌లో అతను 32 వికెట్లు పడగొట్టాడు. టర్బయిన్ మాదిరిగా బంతిని తిప్పడంతో అతని బౌలింగ్ యాక్షన్‌ను అప్పటి ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఒకరు హర్భజన్‌కు టర్బోనేటర్ అనే పేరును పెట్టాడు. అది కూడా ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలా భజ్జీ, టర్బోనేటర్ అనే పేర్లతో హర్భజన్ అందరికీ సుపరిచుతుడు అయ్యాడు.
హర్భజన్ ప్రొఫైల్ ఇదే..
జననం: జులై 3, 1980 (జలంధర్, పంజాబ్)
తొలి టెస్టు: మార్చి 25, 1998 చెన్నైలో ఆస్ట్రేలియాతో
చివరి టెస్టు: ఆగస్టు 12, 2015 గాలేలో శ్రీలంకతో
తొలి వన్డే: ఏప్రిల్ 17, 1998 షార్జాలో న్యూజిలాండ్‌తో
చివరి వన్డే: అక్టోబర్ 25, 2015 ముంబైలో సౌతాఫ్రికాతో
తొలి టి20: డిసెంబర్ 1, 2006, వండరర్స్‌లో సౌతాఫ్రికాతో
చివరి టి20: మార్చి 3, 2016 ఢాకాలో యుఎఇతో
తొలి ఐపిఎల్: ఏప్రిల్ 20, 2008 బెంగళూరుతో
చివరి ఐపిఎల్: ఏప్రిల్ 18, 2021, బెంగళూరుతో
ఆడిన టెస్టులు: 103, పరుగులు 2225, శతకాలు రెండు, అర్ధ శతకాలు 9, వికెట్లు 417
ఆడిన వన్డేలు: 236, పరుగులు 1237, వికెట్లు 269
ఆడిన టి20లు: 28, పరుగులు 108, వికెట్లు 25
ఆడిన ఐపిఎల్ మ్యాచ్‌లు: 163, పరుగులు 833, వికెట్లు 150.