పంజాబ్ నుంచి ఐదు ఖాళీలకు ఆప్ అభ్యర్థులు
చండీగఢ్: ఈ నెల 31 జరిగే రాజ్యసభ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులుగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్, ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దా, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాను ఆమ్ ఆద్మీ పార్టీ నామినేట్ చేసింది. ఈ ఐదుగురు అభ్యర్థులు సోమవారం ఇక్కడి పంజాబ్ శాసనసభ సముదాయంలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పంజాబ్‌కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు సుఖ్‌దేవ్ సింగ్ ధిమ్సా(శిరోమణి అకాలీ దళ్), ప్రతాప్ సింగ్ బల్వా(కాంగ్రెస్), శ్వేత్ మాలిక్(బిజెపి), నరేష్ గుజ్రాల్(ఎస్‌ఎడి), షంషేర్ సింగ్ దుల్లో(కాంగ్రెస్) పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనున్నది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలల్లో మొత్తం 117 స్థానాలలో 92 స్థానాలను ఆప్ కైవసం చేసుకోవడంతో రాజ్యసభ సభ్యులుగా ఈ ఐదుగురి ఎన్నిక లాంఛనప్రాయమే.