Sunday, November 3, 2024

రాష్ట్రాల వైఖరితోనే పెట్రోధరలు భగ్గు

- Advertisement -
- Advertisement -

Hardeep Singh Puri blames states for high fuel prices

జిఎస్‌టి పరిధిలోకి తేవడం ఇష్టం లేదు
కేంద్రం పన్నులు సముచితమే
పెట్రోలియం మంత్రి పూరి

కోల్‌కతా : దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆగకుండా పెరగడానికి రాష్ట్రాల చర్యలే కారణం అని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి నిందించారు. నిత్యావసరాలుగా మారుతున్న పెట్రోలు డీజిల్ ధరల నియంత్రణ విషయంలో కేంద్రం సిఫార్సులను, సూచనలను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని దీనివల్లనే ఇంధన ధరలు పెరుగుతున్నాయని పూరీ వ్యాఖ్యానించారు. పెట్రోలు, డీజిల్ వంటి చమురు ఉత్పత్తులను వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు సుముఖంగా లేవని, పర్యవసానంగానే పెట్రోలు ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. ఉప ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్‌లో ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రి ఈ నేపథ్యంలో వార్తాసంస్థలకు ఇంటర్వూ ఇచ్చారు. తప్పు రాష్ట్రాలది అయినప్పుడు ధరల విషయంలో కేంద్రం ఏ విధంగా జవాబుదారి అవుతుందని ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్‌లో పెట్రోలు ధరలు ఇప్పుడు లీటరుకు రూ వంద దాటాయని, దీనికి కారణం తాము కాదని టిఎంసి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు పన్నులు విధించడం, స్థానిక రుసుంలను వసూలు చేయడం వల్లనే ఈ పరిణామం చోటుచేసుకుందని తెలిపారు. పెట్రో ధరలు తగ్గాలని కేంద్రం భావించడం లేదా అనే ప్రశ్నకు తామిచ్చే సమాధానం ఒక్కటే అని, తగ్గాలనేదే జవాబు అని అయితే ధరలు ఎందుకు తగ్గడం లేదనే ప్రశ్నకు రాష్ట్రాల నిర్వాకమే కారణం అన్నారు. పెట్రోలును జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడం రాష్ట్రాలకు రుచించదని, దీనితోనే ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం పెట్రోలుపైరూ 32 చొప్పున పన్నులు వేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర 19 డాలర్లు ఉన్నప్పుడు ఈ టాక్స్ ఖరారు చేశామని, ఇప్పుడు బ్యారెల్ ధర 75 డాలర్లు అయిందని, అయినా ఇదే రూ 32 పన్నుల విధానం కొనసాగుతోందని తెలిపారు. ఇక ఉచిత రేషన్, ఉచిత గృహవసతి, ఉజ్వల వంటి పలు పథకాలు అమలు చేస్తున్నామని, ఈ భారం అంతా కేంద్రమే మోస్తుందని చెప్పారు. జులైలోనే బెంగాల్‌లో లీటరు పెట్రోలు ధర రూ 3.51 పైసలు పెంచారు.

దీనితో ఇప్పుడు ఇక్కడ రేటు సెంచరీదాటి పోతోందని వ్యాఖ్యానించారు. ఇక్కడ సంయుక్త పన్నుల విధానం దాదాపు 40 శాతంగా ఉందని , ఇక పెట్రో రేటు పెరగడానికి కారణాలు ఏమిటనేది తెలుసుకోవచ్చునని చెప్పారు. కేంద్ర ధోరణితో ధరలు పెరుగుతాయని చెప్పడం చాలా తేలిక, మాటలు ఎంతైనా మాట్లాడవచ్చు, అయితే వాస్తవాలు ఆలోచించి స్పందించాల్సి ఉంటుందన్నారు. ఇక్కడి టిఎంసి ప్రభుత్వం ధరలను ఇటీవలి కాలంలో పెంచలేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ స్థానంలో ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రి వచ్చారు. మమతపై బిజెపి తరఫున పోటీ చేస్తున్న ప్రియాంక టిబ్రేవాల్ తరఫున ప్రచారం నిర్వహించారు.

భవానీపూర్ స్థానంలో ఫలితం ముందుగా ఖరారు అయిందే అని టిఎంసి వర్గాలు అంటున్నాయని, మరి మొత్తం రాష్ట్ర మంత్రులు అంతా ఇక్కడ కేంద్రీకృతం అయ్యి ఎందుకు ప్రచారానికి దిగుతున్నారని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నికలలో బిజెపి గెలుస్తుందని, అయితే ఎన్నికల అనంతర ఘర్షణే ప్రధానాంశం అయ్యేలా ఉందని హెచ్చరించారు. పంజాబ్‌లో రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అస్తిత్వ రహిత స్థితికి ఇది తార్కాణం అన్నారు. కాంగ్రెస్‌కు రాజకీయ విలువలు లేకుండా పొయ్యాయని, బెంగాల్‌లో వారు కొందరు మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తారని, అదే బెంగాల్‌కు వచ్చే సరికి ఈ మిత్రపక్షాలతోనే పోటికి దిగుతారని సరైన వైఖరి లేని విధానంతోనే వారు అంతటా ఖాళీ అవుతున్నారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News