అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో హార్దిక్ అసాధారణ ఆటతో భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో అతను నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లో హార్దిక్ బ్యాట్‌తోనూ, బంతితోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో రెండు స్థానాలు మెరుగు పరుచుకుని కెరీర్‌లో తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఓ భారత ఆటగాడు ఆల్‌రౌండర్‌ల విభాగంలో టాప్ ర్యాంక్‌ను దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఘనత సాధించిన తొలి టీమిండియా క్రికెటర్‌గా హార్దిక్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, హార్దిక్ ప్రస్తుతం శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరగతో కలిసి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.మరో వైపు మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), సికందర్ రజా (జింబాబ్వే), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) టాప్5లో చోటు సంపాదించారు.
అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబి నాలుగు ర్యాంక్‌లు కోల్పోయి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కాగా, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక స్థానం మెరుగుపర్చుకుని ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ వరల్డ్‌కప్ అక్షర్ పటేల్ నిలకడైన బౌలింగ్‌ను కనబరిచిన సంగతి తెలిసిందే. మరోవైపు కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు పైకి ఎగబాకి 8వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్న భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 12 ర్యాంక్‌లను మెరుగపరుచుకున్నాడు. బుమ్రా తాజా ర్యాంకింగ్స్‌లో 12వ స్థానాన్ని దక్కించుకున్నాడు. యువ ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ తాజా ర్యాంగిల్స్‌లో 13వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ ఏకంగా 17 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.