మన తెలంగాణ/క్రీడా విభాగం : భారత క్రికెట్‌లో కపిల్‌దేవ్ తర్వాత ఆ స్థాయి ఆల్‌రౌండర్ ఎవరూ లభించలేదు. అయితే హార్దిక్ పాండ్య రూప ంలో టీమిండియాకు మరో ఆశాకిరణం లభించాడు. కానీ వివాదాలు, గాయాలు హార్దిక్ కెరీర్‌ను సాఫీగా సాగకుండా చేశాయి. ఓ టివి షోలో హార్దిక్ చేసిన వ్యాఖ్యాలు అతని కెరీర్‌కు మాయని మచ్చగా మారింది. ఆ వివాదం తర్వాత హార్దిక్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయాడు. పేలవమైన ఆటతో సతమతమయ్యాడు. ఒకవైపు ఫామ్ లేమీ మరోవైపు వరుస గాయాలు హార్దిక్‌ను వెంటాడాయి. గాయాల వల్ల హార్దిక్ చాలా రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒకప్పుడూ భారత జట్టులో ఎదురులేని శక్తిగా కొనసాగిన హార్దిక్ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో సతమతమయ్యాడు. మూడు ఫార్మాట్‌లలోనూ తుది జట్టులో కచ్చితంగా ఉంటూ వచ్చిన హార్దిక్ ఆ తర్వాత పేలవమైన ఆటతో జట్టుకు భారంగా మారాడు. ఒకవైపు వైఫల్యాలు మరోవైపు గాయాలు హార్దిక్‌ను వెంటాడాయి. చివరికి ఐపిఎల్‌లోనూ హార్దిక్ రాణించలేక పోయాడు.
ఆకాశమే హద్దుగా..
ఇక అందివచ్చిన అవకాశాన్ని హార్దిక్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. గుజరాత్ యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. జట్టును ముందుండి నడిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటాడు. ఐపిఎల్ టోర్నమెంట్ హార్దిక్ కెరీర్‌ను అనూహ్యంగా మలుపుతిప్పింది. కెప్టెన్సీలోనే కాకుండా ఆల్‌రౌండ్‌షోతో హార్దిక్ పలు మ్యాచుల్లో గుజరాత్ చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. అసాధారణ కెప్టెన్సీతో గుజరాత్ చారిత్రక విజయం అందించాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ అరంగేట్రం టోర్నీలోనే ట్రోఫీని సాధించిందంటే దానికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఐపిఎల్ ప్రదర్శనతో హార్దిక్‌కు టీమిండియాలోనూ చోటు దక్కింది. ఇక హార్దిక్ కూడా తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆల్‌రౌండ్ షోతో టీమిండియాకు అద్భుత విజయాలు సాధించి పెట్టాడు. ఈ క్రమ ంలో ఓ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. హార్దిక్ మళ్లీ పూర్వవైభవం సాధించడం టీమిండియాకు అతిపెద్ద ఊరటగా చెప్పక తప్పదు.