Sunday, January 19, 2025

హార్దిక్ పాండ్యకు ఊహించని షాక్..

- Advertisement -
- Advertisement -

ముంబై: శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం గురువారం టీమిండియాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జట్టు ఎంపికలో సెలెక్టర్లు తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టి20 వరల్డ్‌కప్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన భారత్‌కు ట్రోఫీ సాధించడంలో తనవంతు పాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను రోహిత్ శర్మ స్థానంలో పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమిస్తారని అందరూ ఊహించారు. అయితే సెలెక్టర్లు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌ను సారథిగా నియమించారు. ఈ పరిణామం హార్దిక్ పాండ్యకు షాక్ వంటిదేనని చెప్పాలి. వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్య సత్తా చాటిన సంగతి విదితమే.

గతంలో కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కు ఐపిఎల్ ట్రోఫీ కూడా అందించాడు. ఇలాంటి స్థితిలో హార్దిక్‌కు రోహిత్ వారసుడిగా అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీ టి20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను నియమించింది. ఇది ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో అనూహ్య చర్చకు దారితీసింది. టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన గౌతం గంభీర్ సూచన మేరకే హార్దిక్‌ను కెప్టెన్సీకి దూరంగా ఉంచారనే వార్తలు వచ్చాయి. హార్దిక్‌ను సారథిగా నియమించేందుకు గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కూడా సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. అంతేగాక జట్టు ఆటగాళ్లలో చాలా మంది హార్దిక్ కెప్టెన్సీలో ఆడేందుకు ఆసక్తి చూపించలేదని కూడా తెలిసింది. ఇలాంటి స్థితిలో హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసి జట్టు ప్రయోజనాలను ఎందుకు దెబ్బతీయాలనే ఉద్దేశంతో బిసిసిఐ పెద్దలు కూడా ఈ విషయంలో పెద్దగా తలదూర్చలేదని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇక సూర్యకుమార్ యాదవ్‌కి టి20లో మంచి రికార్డు ఉంది. ప్రస్తుతం జట్టుకు ఎంపికైన చాలా మంది ఆటగాళ్లతో అతనికి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. జట్టును సమష్టిగా ముందుకు నడిపించే సత్తా కూడా అతనికి ఉందని సెలెక్టర్లు భావించారు. అన్ని ఆలోచించిన తర్వాత సెలెక్టర్లు, బిసిసిఐ పెద్దలు సూర్యను సారథిగా ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యారు. బోర్డు తీసుకున్న నిర్ణయం హార్దిక్‌ను షాక్‌కు గురి చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్‌లోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరున్న హార్దిక్ టి20 సారథిగా ఎంపిక కావడం ఖాయమని కొన్ని రోజుల వరకు మీడియాలో వరుస కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎవరూ ఊహించని విధంగా హార్దిక్ సారథ్యంలో సూర్యకుమార్ యాదవ్ టి20 కెప్టెన్‌గా ఎంపిక కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News