Sunday, December 22, 2024

హరీష్ గౌడ్ కవిత్వం నిఖార్సైన వాక్యం

- Advertisement -
- Advertisement -

మొదటి కవితా సంపుటి నీటి దీపంలో నా చుట్టూ జరుగుతున్న సంఘటనలను కవిత్వం చేశాను. కొంత సామాజిక స్పృహను కూడగట్టుకున్నాను. వస్తు వైవిధ్యతను కనబరిచాను. రెండవ కవితా సంపుటి ఇన్ బాక్సులో మెరుగైన శిల్పాన్ని సాధించాను. ప్రాపంచిక విషయాలను ,మాధ్యమ ప్రభావాలను సమాజ స్థితిగతులను కవిత్వం చేశాను. నా దృష్టిలో కవిత్వం ఒక పుష్పక విమానం. కవిత్వం కవులకు ఆక్సిజన్. ఇక మూడవ కవితా సంపుటి గాలిలేని చోట. ఏదో ఊపిరాడనితనం నన్ను వెంటాడుతూనే ఉన్న దశలో దేశంలో పరిస్థితులు దైన్యంగా ఉన్న స్థితిలో మానవీయ విలువలు అడుగంటి పోతున్న క్రమంలో , కొంత తాత్వికతను జోడించి, బలహీన వర్గాల పక్షపాతిగా నా కలానికి పదును పెడుతూ మీ ముందుకు వచ్చాను. అంటూ హరీష్ గౌడ్ తన స్వీయ మూల్యాంకనాన్ని ప్రకటిస్తున్నాడు. పాఠశాలలో ప్రతిరోజు పాఠం చెప్పే ఉపాధ్యాయుడు స్వీయ మూల్యాంకనం చేసుకున్నప్పుడు మరో రోజు తన పాఠాన్ని విద్యార్థులకు ఎలా బోధించాలో, విద్యార్థుల్లోకి పాఠమై ఎలా ప్రవహించాలో తెలుస్తుంది.

అలాగే నిరంతరం కవిత్వం రాస్తూ జల ఇంకిపోకుండా సాగుతున్న హరీష్ గౌడ్ లో స్వీయ మూల్యాంకన లక్షణం ఉండటం ,అతన్ని మెరుగు పరుస్తుంది. ఉపాధ్యాయుడుకి గాని, కవికిగాని స్వీయ మూల్యాంకనం అనేది ఎప్పటికప్పుడు లోపలికి చూసుకుని, లోపాల్ని సరి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. నేను ఒక పాఠకుడిగా ఇప్పుడు హరీష్ కవిత్వాన్ని బాహ్య మదింపు చేసే ప్రయత్నం చేస్తున్నాను.కవిత్వం కాల్పానికి సాహిత్యం అన్న విషయం మనకు తెలుసు. జీవిత సత్యాల్ని ఆవిష్కరిస్తుంది. అలాగే జీవితానికి సంబంధించినటువంటి వాస్తవాలను తెలుపుతుంది. ఇంకొనాళ్ళ లో వచన కవిత్వం వందేళ్లు పూర్తి చేసుకుంటుంది. హరీష్ మనల్ని మూడు పుస్తకాలుగా పలకరించాడు. ఈ మూడు పుస్తకాల్లో హరీష్ ఏం మాట్లాడాడు? ఒక్కో పుస్తకానికి, ఒక్కో పుస్తకానికిఅతనిలో కనిపిస్తున్న మార్పులు ఏమిటి? అతని వస్తువు ఏమిటి? అతని దృక్పథం ఏమిటి? ఎవరు పక్షాన నిలబడుతున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ మూడు కవిత సంపుటాల్లో మనకు సమాధానాలు దొరుకుతాయి. చిన్న గులక రాయి లాంటి/ కవిత్వమే నేను/ కవితా సంద్రం పైకి దూకి /తీరపు జాడల కోసం అన్వేషిస్తున్నాను ‘ మొదటి కవితాసంపుటిలో ఈ వాక్యాలు కనిపిస్తాయి.

మూడవ కవితా సంపుటికి వచ్చేసరికి ‘పద్యం నా లైలా /పద్యం నా అనార్కలి /పద్యమే నా ప్రేయసి/ అనకుండా /ఇంకేం అనాలి‘ ఈ వాక్యాల్లో ఒక పూర్తి సాధికారత, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. హరీష్ కి ఆత్మగలిగిన పదాలను ఏరుకొని చక్కన కవితలుగా మార్చడం బాగా తెలుసు. మేఘాలపై వాక్యంతో పచ్చటిసంతకం చేయడం తెలుసు. అతను చెప్పుకున్నట్టుగానే మొదటి కవిత సంపుటిలో వస్తువు వైవిధ్యాన్ని గమనించ వచ్చు. అయితే గతంలో ఈ వస్తువులపై ఎవరూ రాయలేదా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ వస్తువులపై చాలామంది రాసిన కవితలు గుర్తుకు వస్తాయి. కొన్ని ఎవరూ రాయని వస్తువులు కూడా ఉన్నాయి. జారుడు బండ కవిత దానికి మంచి ఉదాహరణ. ఈ పద్యం నోస్టాల్జియా కావచ్చు. కానీ ముగింపు హరీష్ లోని కవితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆ జారుడు బండను ఆధారంగా చేసుకుని నిజానికి కవిత్వం అంటే తనలోకి తానుచూసుకోవడమే కదా అనడం ద్వారా తన పరిపక్వతను నిరూపించుకున్నాడు. అలాగే రొట్టెలమ్మలు అనే కవిత వస్తు వైవిధ్యంతోపాటు, కవిగా అతని ప్రతిభను చాటుతోంది.

‘సూర్యుడిని మంటగా పెట్టి /గాలితో సోపతి చేసుకుంటూ /అరచేతుల్లో చందమామలు గీస్తారు‘ ఇలా ఎత్తుగడ వాక్యాలతోనే మనల్ని లోపలకి తీసుకుపోతాడు. శ్రమ యొక్క జీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తాడు. పట్నంలోకి వచ్చి తమకు తెలిసిన విద్య ద్వారా జీవన పోరాటం చేస్తున్న మహిళల బతుకు చిత్రాన్ని మన ముందు నిలుపుతాడు. ‘జొన్న రొట్టెలతో చేతిలున్న/ వంకర గీతల సక్క చేసుకుందామని/ పట్నంల పొయ్యై వెలుగుతున్నరు‘ రొట్టెలకు ప్రాణం పోయడం వాళ్లకి జొన్న లతో పెట్టిన విద్య అంటూ తన కవిత్వం నిర్మాణ శక్తిని తెలుపుతాడు./ ఉన్నప్పుడే కళ్ళకి కళ్ళు పెట్టి ప్రేమగా చూసుకుందామని, జీవితమంటే భుజాలను మార్చుకోవడం అని , కవిత్వం అంటే మిగిల్చుపోవడం ,రగుల్చు కోవడం అని కొన్ని సత్యాల్ని ప్రకటిస్తాడు. ఇక రెండవ కవితా సంపుటి ఇన్ బాక్సులోకి వచ్చేసరికి సామాజిక మాధ్యమాల్లోని భాషను వాడుకోవడం ద్వారా కవిత్వాన్ని ఈ తరానికి దగ్గర చేయడమైన ప్రయత్నం కనిపిస్తుంది. మనిషి జాడ కోసం అతను ఆన్లైన్లో ఉన్నాడా ఆఫ్లైన్లో ఉన్నాడా చెక్ చేయాలి అని చెప్పడం ద్వారా మన జీవితాల్లో ఆ మాధ్యమాలు ఎంతగా చొరపడ్డాయో హెచ్చరిస్తున్నాడు. కాలం గడిచే కొద్దీ భాషలో మార్పులు వస్తూ ఉంటాయి. నుడికారంలో కూడా తాత్కాలికమైన మార్కులు జరుగుతూ ఉంటాయి.

మన భాషలోకి ఇతర భాషా పదాలు ప్రవేశిస్తుంటాయి. అప్పుడు రాస్తున్న కవులు అంతా , తత్కాల సంబంధం పదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఆ పదాలను సమర్థవంతంగా కవితల్లోకి తీసుకురాగలగలి. ఇన్ బాక్స్ కవిత్వ సంపుటిలో హరీష్ చేసిన మంచి ప్రయోగం ఇది. ఇప్పుడు మనుషులు అనుబంధాలను ఆప్యాయతలను డేటాతో కనబడుతున్న ఒక కొత్త యాప్ రూపాలు ఈ ఒక్క వాక్యం చాలు ఇన్బాక్స్ యొక్క ఆత్మను పట్టించడానికి. జార్జ్ ఫ్లాయిడ్ మరణించినప్పుడు వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా, జాత్యహంకారానికి నిరసనగా చాలా కవితలు వచ్చాయి. అయితే హరీష్ రాసినకవిత చాలా భిన్నమైంది. శీర్షిక నుండి ముగింపు వరకు విభిన్నంగా ఉంటుంది. తాను చెప్పదలుచుకున్న సారాన్ని ఒకే ఒక వాక్యంలో చెప్పడం హరీష్ కవిత్వం లో ఉన్న మరో కోణం.
‘నలుపు=తెలుపు అంటూ/ ఓ సమీకరణానికి తెర లేపుదాం ‘ ఈ వాక్యం పైన నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి ఒక ఉదాహరణ. ఇంకోచోట/ ‘ రాత్రి చుట్టూ/ మనుషులు కాదు/ మనుషుల చుట్టే/ రాత్రి తిరుగుతుంది‘/ హరీష్ కవిత్వంలో మరో కోణం అంతకుముందు ఎవరో చేయని కొన్ని ఊహల్ని చేయగలగడం. చెప్పిన ఊహల్ని వాడిన పదబంధాల్ని కాకుండా తనదైన దృష్టి ,దృక్కోణమూతో వాక్యం ఐపోవడం గమనించదగిన అంశం.

కవికి సరైన ప్రాపంచిక దృష్టి లేకపోతే ఎంత గొప్ప వస్తువు తీసుకున్న కవిత్వం విఫలం అవుతుంది. నిలబడకుండా పోతుంది .పాఠకుడి కి అనుభూతిని ఇవ్వదు. హరీష్ కవిత్వంలో ఇవన్నీ ఉండడం ద్వారా పాఠకుడిగా మనం సంతృప్తి చెందగలుగుతాం. హరీష్ కవిత్వంలో మరో అంశాన్ని గమనించవచ్చు. చాలా చోట్ల పాజిటివ్ దృక్పథాన్ని వ్యక్తీకరించాడు.గ్రీన్ సిగ్నల్ కవిత దీనికి మంచి ఉదాహరణ. జీవితాన్ని దాటడానికి మనకు మనమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవాలని చెప్పడం చాలా బాగుంది. ‘ఎందుకలా నదిని పక్కకు తోసేస్తున్నావ్ /ఈదలేకనా/కలలను సబ్బు నురగల్లా పూసుకోవాల్సిన యవ్వనం నీలో ఉంది/ నీకు నువ్వే గ్రీన్ సిగ్నల్‘ ఇలాంటి ధనాత్మక ఆలోచనను కలిగించే కవితలు మూడు సంపుటాల్లోనూ కనిపిస్తున్నాయి. చాలాచోట్ల అతని ఊహలు మనల్ని అబ్బుర పరుస్తాయి. మట్టే మాకు ఆకాశం అనడం ద్వారా అతని పాదాలు, పదాలు ఎక్కడ ఉన్నాయో చెప్పొచ్చు.తాటివనం యాదిలో రాసిన కవితలో ముంజనీళ్లు వెన్నెల కిరణాలై ముఖాన్ని ముద్దాడేవి అంటాడు.తాటి చెట్టు దాని చుట్టూ అల్లుకున్న జీవితం గురించి , చాలా మంది రాశారు. అయితే ముంజ నీళ్లను వెన్నెల కిరణాలుగా చెప్పడం కొత్త ఊహ. అలాగే మరణం గురించి హరీష్ చాలా చోట్ల మాట్లాడాడు.

మాట్లాడిన ప్రతిచోట ఆలోచింపజేశాడు. మృత్యువేం చేస్తుంది /తన పని తాను చేసుకెళ్ల ఊరుకుంటుందా ఇది సాధారణ వాక్యంలా అనిపించినా , లోతైన భావన ఉంది. ఇక స్త్రీలను గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో స్త్రీగానే మాట్లాడాడు. స్త్రీలను పోల్చడానికి సముద్రము ,సూర్యుడు, జాబిలి సరిపోవని ఆమెను ఆమెతోనే పోల్చాలని అనన్వయం లో ఆవిష్కరించాడు. లాక్ డౌన్ పోయెట్రీ లోని తాత్వికత మనల్ని వెంటాడుతుంది. దగ్గరతనం ఎప్పుడు నటనని దూరం ఎప్పుడూ నిజమేనని సాధారణీకరించడం నిజమే. గాలి లేని చోట కవితా సంపుటిలో చాలా తేలికైన మాటలతో ఎంతో శక్తివంతమైన భావనలను కవిత్వం చేయడం ఎలాగో నిరూపించాడు. భావనా బలం ఘనంగా కలిగిన కవి హరీష్.ఆశీస్సులు ఇచ్చేవాడు తీసుకునేవాడు /ఇద్దరు ఉండరు -వణుకుతున్న చేతులు/ సహాయం కోసం పైకి లేస్తాయి/ రహస్యాలు చెవులను తాకకుండా/ దూరం వెళ్ళిపోతాయి/ ప్రార్థనలకు చోటు ఉండదు/ యాత్ర ఇక కొనసాగదు /గాలి లేని చోట/ కొండలు కూడా ఊపిరాడదు ఈ వాక్యాలకు ఎలాంటి వ్యాఖ్యానము అవసరం లేదు. పాఠకుడు ఆ భారాన్ని, ఆ భావాన్ని సులభంగానే తనలోకితీసుకుంటాడు. గాలిలేని చోట కవిత సంపుట్లో దేశంలో జరిగిన అనేక అనాగరిక ,అమానవీయ సంఘటనలను కవిత్వీకరించాడు.

బాధితుల పక్షాననిలబడ్డాడు. ఆదివాసి ముఖం మీద మూత్రం పోసిన సంఘటన కి స్పందిస్తూ నేను కవినని /తెగ బలిసిన అంగాలను కత్తిరింపు వేసే /పదునైన వాక్యమొకటి రాయాల్సి వస్తుందని/ తలుచుకుంటేనే/ నా దేశం ముఖచిత్రం/ ఏనాడో చిరిగిపోయినట్టనిపిస్తుంది ‘ అని ఆవేదన చెందాడు.హరీష్ సంఘటనలను రికార్డు చేసే క్రమంలో కూడా కవిగా విఫలం కాలేదు. ఈ కవితకు పెట్టిన శీర్షిక నాలుగో రకం మనిషి. మూడు కవిత సంపుటాల్లోను శీర్షికలు పెట్టడం దగ్గర , ఈ కవి విభిన్నంగా కనిపించాడు. శీర్షిక కూడా కవితలో భాగమే అని గ్రహించినవాడు కాబట్టి మంచి శీర్షికలను ఎంచుకున్నాడు. తను ఎంచుకున్న స్పందనను పాఠకుల్లో కలగజేయడానికి హరీష్ భావ ప్రధానంగా, ధ్వని ప్రధానంగా పనిముట్లను అప్రయత్నంగా తెచ్చుకున్నాడు. ఒక సంఘటనను దృశ్యాన్ని వ్యక్తీకరించాలంటే కవిత స్వేచ్ఛగా తన మాధ్యమాన్ని ఎంచుకుంటుంది. ఆ ఎంచుకునే సమయంలో కవి అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు కవి సొంత గొంతుక పాఠకుడికి వినిపిస్తుంది. ఇట్లాంటి సొంత గొంతుకు హరీష్ కవితల్లో మనం చాలా చోట్ల పరిశీలించవచ్చు. ఒకప్పుడు అడవి ఉండేది అనే కవితలో చివరి వాక్యం చూడండి.

‘పూర్వం/ అడవిలో నుంచి మనిషి పుట్టాడు/ ఇప్పుడు/ మనుషి లోంచిఅడవి పుట్టాలి‘ ఈ వాక్యం ఒక బలమైన స్టేట్మెంట్. మనిషి లోపల చివరించాల్సిన అడవి గురించి హరీష్ కలత చెందుతున్నాడు. మనల్ని కూడా కలవర పెడుతున్నాడు. గాలి లేని చోట కవితా సంపుటిలో రాజ్యానికి చికిత్స చేయడం కోసం మనుషులం అనుకున్న వాళ్లంతా నల్లని మబ్బులమై కురవాల్సిన అవసరం గురించి , ఫాసిస్టు కుర్చీ ఖాళీ చేయడం గురించి, ఒకరి కలలను చదివేస్తూ ఆ కనుమంటల్లో హాయిగా చలికాచుకునే కాలాన్ని పసిఘట్టాల్సిన అవసరం గురించి హెచ్చరిక చేశాడు. ఉదయాన్నే రోడ్లను శుభ్రం చేసే మున్సిపాలిటీ కార్మికుల నేపథ్యం లో రాసిన కవితలో చాలా ఉదాత్తమైన మాటల్ని హరీష్ పలికాడు . వాళ్లు రోడ్లు కిరువైపున నాటబడిన పచ్చని మొక్కలని ,దార్లుకు ఊపిరిలు పోసే ప్రాణవాయువులని అన్నాడు. అంతేగాక ఏ ఒక్క వాక్యం లోనో కవితలను పూరింపు లేని జీవమున్న జీవితం అనే ముగింపు వాక్యం తో తనలో ఉన్న కవిత్వ నిర్మాణ శక్తిని చూపాడు. హరీష్ అక్షరాన్ని నరనరానా నింపుకున్నాడు. దేహాన్ని పదాలుగా పేర్చుతున్నాడు.

ఈ మూడు కవిత సంపుటలను పరిశీలిస్తే కవిత్వమే జీవితంగా ,జీవితమే కవిత్వంగా బ్రతికే పద్యం హరీష్ ,అని నిర్ధారణ చేయవచ్చు. హరీష్ లో గమనించదగిన మరో అంశం నాలుగు వాక్యాల మినీ కవితలను చాలా చక్కగా రాస్తున్నాడు. విలేజ్ రింగ్టోన్స్, ఎనిమిది పదులు ప్రపంచం ఈ కవితలు వీటికి చక్కని ఉదాహరణలుగా చూపవచ్చు. ప్రతి వస్తువును కవిత్వం చేయాలనే తపన కనబడుతుంది. అయితే ఈ తపన కవితా వాక్యాల్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కొన్నిచోట్ల చాలా సాధారణ వాక్యాలు మిగతా కవితను తేలిక చేయడం చూడవచ్చు. గాయపడిన హృదయాలకు మందులాంటి కవిత్వం హరీష్ రాస్తున్నాడు. నా గుండె ఆకు రాయిగా చేసుకుని కవిత్వం రాస్తున్నాను అని చెప్పుకున్న హరీష్ గుండె నిశ్శబ్దాలను చేధించేశబ్దభేది. హరీష్ కవిత్వంలో సామాన్యుల బతుకు చిత్రాలతో పాటు, దేశముఖచిత్రం కూడా కనిపిస్తుంది. తాజాతనం కోసం తపన ఉంటుంది. ప్రతి క్షణాన్ని కవిత్వం చేయడం పట్ల కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు. కవిత్వం ఉన్నచోట హరీష్ ఉంటాడు, హరీష్ ఉన్న చోట కవిత్వం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News