రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విపక్ష నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బుధవారం ఆయన స్వల్పకాలిక చర్చలో మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. విపక్షాలపై రాజకీయ దాడి చేయడం ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని చెప్పారు. శ్వేతపత్రంలో వాస్తవాల వక్రీకరణ జరిగిందనీ, ప్రభుత్వానికి అనుగుణంగా లెక్కలు తయారు చేశారని ఆయన విమర్శించారు.
ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సస్పెండయిన ఒక ఆంధ్ర అధికారి సహాయంతో శ్వేతపత్రాన్ని రూపొందించారని హరీశ్ ఆరోపించారు. తెలంగాణా అధికారులపై నమ్మకం లేకనే ప్రభుత్వం ఆంధ్ర అధికారులతో శ్వేతపత్రాన్ని రూపొందించిందని అన్నారు. శ్వేతపత్ర రూపకల్పనలో ముఖ్యమంత్రి పాత గురువు, శిష్యుల పాత్ర ఉందన్నారు.
శ్వేతపత్రంలో ప్రజలు-ప్రగతి అనే కోణం లోపించిందనీ, అప్పుల గురించి చెప్పారే ఆదాయం ఎలా పెరిగిందో చెప్పలేదని హరీశ్ విమర్శించారు. తెలంగాణాకంటే 22 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు తీసుకున్నాయని, ఈ జాబితాలో తెలంగాణాది కిందనుంచి ఐదోస్థానమని హరీశ్ చెప్పారు. కర్ణాటక, రాజస్థాన్ కూడా మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. అప్పులు, జీఎస్డీపీ నిష్పత్తిని శ్వేతపత్రంలో చూపించలేదని చెబుతూ, ఆదాయం, ఖర్చులపై హౌస్ కమిటీని నియమించాలని ఆయన సవాల్ చేశారు.