ఈ- కారు రేసింగ్ కేసులో కెటిఆర్ నైతిక విజయం ఆయనపై
పెట్టిన కేసులో పసలేదని తొలి అడుగులోనే తేలిపోయింది
అసెంబ్లీలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు రూ.600కోట్ల
అవినీతి అంటూ అసత్యాలు చెప్పారు నిజానికి రూ.700కోట్ల
లాభం తెచ్చిపెట్టిన ఈ-కారు రేసింగ్: హరీశ్‌రావు
తొలి అడుగులోనే తమ పార్టీ నేత కెటిఆర్ నైతిక విజయం సాధించారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు పేర్కొన్నారు. ఇది డొల్ల కేసు అని మొదటి అడుగులోనే స్పష్టమైందని వ్యా ఖ్యానించారు. సిఎం రేవంత్‌రెడ్డి ఫార్ములా -ఈ రే సు అంశంపై అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఫార్ములా- ఈ రేసింగ్‌పై అ సెంబ్లీలో చర్చించాలని కోరితే.. బిఆర్‌ఎస్ సభ్యుల ను సభ నుంచి బయటకు పంపి చర్చించారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచా రి, ఎంఎల్‌ఎలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కె.పి.వివేకానంద, దేశపతి శ్రీనివాస్ తదితరులతో కలిసి హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడు తూ, కెటిఆర్‌పై సిఎం రేవంత్ రెడ్డి అక్రమంగా బ నాయించిన కేసును ప్రాథమికంగా పరిశీలించిన హైకోర్టు.. అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.
ఈ కేసులో తొలి అడుగులోనే నైతిక విజయం సాధించిన కెటిఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని, గోబెల్స్ ప్రచారం చేశారని హరీష్‌రావు మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసులో రూ.600 కోట్ల అవినీతి అంటూ సిఎం అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చే శారని ఆరోపంచారు. ఈ కారు రేసింగ్ మీద సభ లో చర్చ జరపాలని తాము అడిగామని, వాస్తవా లు ప్రపంచానికి చెబుదాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని స్పీకర్‌ను కలిసి కోరామని చెప్పా రు. కేసు పెట్టవద్దని తాము అడగటం లేదని, చ ర్చ పెట్టండి అని అడిగామని పేర్కొన్నారు. చర్చకు ఎందుకు ఒప్పుకోలేదు.. ప్రజలకు వాస్తవాలు తెలియవద్దా..? అని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ రేస్‌కు మూడో విడత కింద 50 శాతం నిధులు చెల్లించకపోవడం వల్ల అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని ఎవివి కంపెనీ డిసెంబరు 22న దాన కిశోర్‌కు లేఖ రాసిందని తెలిపారు. 50 శాతం నిధులు అంటే కేవలం రూ.45 కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం అంటున్నారని మండిపడ్డారు. వాస్తవానికి రాష్ట్రానికి 700 కోట్ల లాభం జరిగిందని చెప్పారు. రేవంత్ తుగ్లక్ పనుల వల్ల, పిచ్చి పని వల్ల రాష్ట్రానికి 700 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు.
ఫార్ములా ఇ రేస్ నిర్వహణ వల్ల ఆరేడు వందల కోట్లు హైదరాబాద్‌కు మేలు జరిగింది అని 2022లో నీల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ చెప్పిందని గుర్తు చేశారు.ఈ వ్యవహారంలో కెటిఆర్ మీద కేసు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.ఇందులో అవినీతి జరగలేదని, మరి ఎసిబి కేసులు ఎందుకు పెట్టిందని అడిగారు. రాష్ట్ర ఖజానా నుంచి, నేషనల్ బ్యాంకు నుంచి ఆ సంస్థకు డబ్బులు పంపారని, ఇందులో అవినీతి ఏముందని ప్రశ్నించారు. నిధుల చెల్లింపుల్లో ఇర్రెగ్యులారిటీ తప్ప.. ఇల్లీగల్ మాత్రం లేదని చెప్పారు. రేసింగ్ నిర్వహించిన సంస్థకు హెచ్‌ఎండిఎ నుంచి చెల్లింపులు జరిగాయని అన్నారు. ఫార్ములా రేసింగ్ నిర్వహించేందుకు 192 దేశాలు పోటీపడ్డాయని, రేసింగ్ కోసం మొదటి దఫాలో రూ.30 కోట్లు ఖర్చు పెడితే జీఎస్‌టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.71 కోట్లు వచ్చిందని వివరించారు. మూడో విడతలో రూ.45 కోట్లు చెల్లిస్తే..రాష్ట్రానికి రూ.600 కోట్ల లాభం వచ్చేదని పేర్కొన్నారు. ఫార్ములా -ఈ కార్ రేసింగ్ వల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరిగిందని వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం ఫార్ములా- 4 నిర్వహించి రూ.140 కోట్లు ఖర్చు పెట్టిందని, చంద్రబాబు ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చు పెట్టి ఆఫ్రో- ఏసియన్ గేమ్స్ నిర్వహించిందని చెప్పారు.
రేవంత్‌రెడ్డి చర్యల వల్ల రాష్ట్ర పరపతి దెబ్బతింటోంది
గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగొద్దని, సభలో కెటిఆర్ నిలదీయకుండా ఉండాలని అక్రమ కేసులు పెడుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి చర్యల వల్ల రాష్ట్ర పరపతి, ఇమేజ్ దెబ్బతింటోందని అన్నారు. తన ఏడాది పాలనా వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు గిమ్మిక్కలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి కుటుంబం అవినీతిని ఎప్పటికప్పుడు కెటిఆర్ బయటపెడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చర్యల వల్ల రాష్ట్రంలో స్థిరాస్తి రంగం కుదేలైందని ఆరోపించారు. తమకు కోర్టుల మీద నమ్మకం ఉందని, అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఫార్ములా రేసింగ్ కేసు వివరాలు ఈడీ అడిగిందని వార్తల్లో చూశానని, గురువారం నమోదు అయిన కేసులో వెంటనే ఇడి జోక్యం వెనుక మతలబు ఏంటి..? అని ప్రశ్నించారు.ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బిజెపి దోస్తానా స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. కుట్రలు చేసి కెటిఆర్‌ను జైలులో పెట్టడమే రేవంత్‌రెడ్డి లక్ష్యం అని పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చ పెడితే కేసు డొల్లతనం బయటపడుతుందని హరీశ్‌రావు అన్నారు.
శుక్రవారం వచ్చిందంటే అందరూ భయపడే పరిస్థితి నెలకొంది
అరెస్టులతో లీడర్లను, క్యాడర్‌ను భయబ్రాంతులకు గురిచేసి సిఎం తన కుంభకోణాలను, లంబకోణాలను యథేచ్చగా కొనసాగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును కెటిఆర్ హైదరాబాదుకు తెచ్చారని, ఇందులో ఆయన చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్‌ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కి డెస్టినేషన్‌గా మార్చాలనుకున్నారని, అది కెటిఆర్ చేసిన తప్పా..? అని అడిగారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు ఏదో శోధించినట్లు రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని,ఆ డైవర్షన్‌లో భాగమే.. కెటిఆర్ మీద పెట్టిన కేసు అని పేర్కొన్నారు. ఈ రేవంత్ రెడ్డికి విజన్ లేదు, విస్‌డమ్ లేదని విమర్శించారు. మాజీ కేంద్రమంత్రి దివగంత దాసరి నారాయణ రావు గతంలో చంద్రబాబు పాలన ఎట్లుండెనో చెప్పేందుకు “పిచ్చోడి చేతిలో రాయి” అనే సినిమా తీశారని,
అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు, ఎవరి మీద పడుతడో, ఏం కేసులు పెడతడో తెల్వకుండా అయ్యిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం వచ్చిందంటే చాలు అందరూ భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. రైతుల మీద కేసులు, విద్యార్థుల మీద కేసులు, ఆటో డ్రైవర్ల మీద కేసులు, అంగన్‌వాడీల మీద కేసులు, ఆశావర్కర్ల మీద కేసులు, చివరకు పోలీసుల మీద కూడా కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్ల మీద కూడా కేసులు పెట్టించారని అన్నారు. రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యాలపై అడుగడుగునా నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం పెద్ద విషయమా..? అని అడిగారు. సగం మంది రుణమాఫీ ఎగ్గొట్టినోడికి, రైతుబంధు ఎగ్గొట్టినోడికి, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టినోడికి, జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టినోడికి, పింఛన్ల పెంపుదల ఎగ్గొట్టినోడికి, మహిళలకు 2500 ఎగ్గొట్టినోడికి, ఆడబిడ్డలకు తులం బంగారం ఎగ్గొట్టినోడికి, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినోడికి…మొత్తంగా అభయహస్తం మేనిఫెస్టోనే ఎగ్గొట్టినోడికి కేసులు పెట్టుడు తప్పం ఇంకే చాతనైతదని అన్నారు. ఇప్పటికైనా పిచ్చి ప్రయత్నాలు మానుకో… రాష్ట్రం కోసం పని చేయాలని హరీష్‌రావు కోరారు.