సిద్ధిపేట: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాల రాస్తున్నదని, బిజెపి పాలిత రాష్ట్రాలలో కార్మికుల శ్రమ దోపిడి జరుగుతున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధిపేట శ్రీనివాస టాకీసులో సోమవారం మధ్యాహ్నం బీఆర్ టీయూ-ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ జెండావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ ప్రపంచంలోని వాడ వాడలో మేడే జరుపుకుంటున్న కార్మికులందరికీ మంత్రి హరీశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో అతి పెద్ద కులం కార్మికుల కులం. మనమంతా కార్మికులమే. అలసి పోకుండా నిరంతరం వెలుగును ఇచ్చేవాడు సూర్యుడు. అలసిపోకుండా ప్రపంచానికి సేవ చేసే వాడు కార్మికుడని మంత్రి హరీశ్ రావు చెప్పారు.అటువంటి కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా పని చేస్తుందని తెలిపారు. కార్మికులను గుర్తించాల్సిన బాధ్యత అన్నీ ప్రభుత్వాలపై ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: వెలుగు జిలుగులతో తెలంగాణ విరాజిల్లుతోంది: సిఎం కెసిఆర్
బిజెపి పాలిత 16 రాష్ట్రాలలో బీడీలు చేసే కార్మికులను పట్టించుకోలేదని, ఆ విషయం మహిళా మంత్రి అయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. బీడీ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు రూ.6 లక్షల భీమాను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని, కార్మిక లోకం కలసి పనిచేయాలని, కార్మికులను సంఘటితం చేయాలని కోరారు. సిద్దిపేటలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సూపర్ స్పెషాలిటీ వెయ్యి పడకల ఆసుపత్రి రాబోతున్నదని, త్వరలోనే ఈఎస్ఐ- డిస్పెన్సరీ కార్మికుల కోసం తేనున్నామని మంత్రి వెల్లడించారు.