హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్వీకరించారు. ప్రమాణం చేసేందుకు రావాలని సిఎం రేవంత్ కి హరీశ్ సవాల్ విసిరారు. ఎల్లుండి అసెంబ్లీ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని హరీశ్ రావు తెలిపారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు సిఎం కూడా రావాలని హరీశ్ కోరారు. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను పంద్రాగస్టులోపు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 100 రోజుల్లో అమలు చేస్తామని సిఎం ప్రమాణం చేయాలన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు నెరవేర్చాలని హరీశ్ పేర్కొన్నారు. అమరవీరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దామని ఆయన సవాల్ విసిరారు. పంద్రాగస్టులోగా హామీలు నెరవేరిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని హరీశ్ రావు తెలిపారు. రాజీనామా తర్వాత ఉపఎన్నికల్లోనూ పోటీ చేయనని స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే రేవంత్ రాజీనామా చేస్తారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. పదవికంటే తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే తనకు సంతోషం అని ఆయన వెల్లడించారు.