Monday, December 23, 2024

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని మాజీ మంత్రి, సిద్ధిపేట బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బిజెపిలోకి వెళతారని ఆ పార్టీ నేతలు అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటున్నా రేవత్ ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు ఒక వైపు కోరుతున్న నేపధ్యంలో మరో వైపు రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలు ఉన్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. టియుడబ్లుజె ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో శనివారం నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో పాల్గొన్న హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రతి రంగంలో విఫలం కావడంతో ప్రజల్లో మార్పు మొదలైందని, తద్వారా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు కెసిఆర్‌ను, ఆయన పాలనను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్‌ఎస్ గెలవాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా లేదు గానీ పగ ప్రతీకారాలు కనిపిస్తున్నాయి. ప్రజాపాలన అట్టర్ ప్లాప్ అయ్యిందని, ప్రజాపాలనలో 3.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. వాటిలో ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నాడని, తమ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీతో అధిక స్థానాల్లో విజయం అందిస్తే రాష్ట్ర ప్రయోజనాను బీఆర్‌ఎస్ కాపాడుతుందని అన్నారు.

విజ్ఞతతో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలని ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయాలని పిలుపునిచ్చారు. హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండు పేపర్ బౌన్స్ అయినప్పుడు అందుకు శిక్ష వేయాలని ప్రజలే నిర్ణయించారని అన్నారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలుపైనా, పరిపాలనపైనా లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ పరిపాలన వికేంద్రీకణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తానని రేవంత్‌రెడ్డి చెబుతన్నది రాష్ట్రం ముందుకు పోవడమా..? వెనక్కి పోవడమా..? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయ ప్రయోజనాల కోసం ఏడు మండలాలను ఏపీకి ఇచ్చి ఇప్పుడు వాటిని తెలంగాణలో కలుపుతామని చెప్పడం తెలంగాణ ప్రజలను మోసగించడం కాదా అని హరీశ్‌రావు నిలదీశారు. కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్ కిట్, తాగు నీళ్లు ఇస్తే తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని అడిగారు.

కేసీఆర్ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చితే వడ్లు కొనకుండా వివక్ష చూపారని ధ్వజమెత్తారు. కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్‌ఎస్‌కే ఎక్కువ వస్తాయని హరీశ్‌రావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కవిత అరస్ట్ కాలేదు కాబట్టి బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటని అబద్ధాలు చెప్పి మైనారిటీ ఓట్లు సంపాదించుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కవిత అరెస్టయ్యారు కాబట్టి ఏం సమాధానం చెబుతారని చురకలు అంటించారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారని, కేబినెట్లో మైనారిటీ ఒక్కరిని కూడా తీసుకోలేదని, రంజాన్ తోఫా నిలిపేశారని గుర్తు చేశారు. మీట్ ద ప్రెస్‌లో టియుడబ్లుజె రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఎన్‌డిటివి జర్నలిస్టు ఉమా సుధీర్ పాల్గొన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News