Tuesday, September 17, 2024

హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి వాహనాలపై దాడి: కెటిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నేతల వాహనాలపై దాడి కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం
సంఘటనకు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ఖమ్మం జిల్లా కేంద్రంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు వాహనాలపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగటం వారి అసహనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

దాడి గురించి తెలిసిన వెంటనే హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డిలకు కెటిఆర్ ఫోన్ చేసి, సంఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ఖమ్మం వెళ్లిన పార్టీ నేతలను అభినందించారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక…సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ గుండాలు ఈ దాడికి తెగబడ్డారని కెటిఆర్ మండిపడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా..? అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్లిన బిఆర్‌ఎస్ నాయకులపై దాడులకు తెగబడటం సిగ్గుచేటని విమర్శించారు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.

బిఆర్‌ఎస్‌కు ఇలాంటి దాడులు కొత్త కాదు అని…గతంలో తెలంగాణ కోసం ఇలాంటి ఎన్నో దాడులను ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్ గుండాలు ఎన్ని దాడులు చేసినా ప్రజలకు అండగా ఉండే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన బిఆర్‌ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు సమమతమవుతుంటే ప్రజలను గాలికి వదిలేసి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తుండటం కాంగ్రెస్ చేతగాని తనమని పేర్కొన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని సరైన సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బుద్ధి చెబుతారని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News