Saturday, January 25, 2025

రేవంత్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సంక్షేమానికి చిరునామాగా సిఎం కెసిఆర్ మారారని, వచ్చే ఎన్నికల్లో సిఎం కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, వ్యవసాయాకి 3 గంటల కరెంటు ఇస్తే చాలని చెప్పిన టిపిసిసి ఛీఫ్ రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పంచాయతీ సెక్రటరీ, ఆర్‌టిసి ఉద్యోగులను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం సంగారెడ్డిలోని పిఎస్‌ఆర్ గార్డెన్‌లో లబ్ధ్దిదారులకు 300ల మందికి బిసి బంధు చెక్కుల పంపిణీ, పంచాయతీ కార్యదర్శులకు రెగ్యురైజేషన్ సర్టిఫికెట్లు, గోకుల్ ఫంక్షన్ హాలులో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెక్కులను హరీశ్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్‌తో కలిసి హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్ వచ్చేదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో 24గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టే సమావేశాలకు జనాలు రావడం లేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు, 24గంటల ఉచిత కరెంట్ అందజేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దని చెప్పారు. 3 శాతం ప్రజలు ఉన్న రాష్ట్రానికి 38 శాతం అవార్డులు వచ్చాయంటే సిఎం కెసిఆర్ కృషే కారణమన్నారు. కుల వృత్తులను కాపాడుకునేందుకు బిసి బంధు ఇస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 20లక్షల ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ ఇస్తున్నామని చెప్పారు. 35 వేల సెలూన్‌లు, 60వేల లాండ్రీలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో 19 బిసి గురుకులాలు ఉంటే స్వరాష్ట్రంలో 310 బిసి గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. బిసిల సంక్షేమానికి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలు తీసుకు వచ్చి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే రైతు బంధు, రైతుబీమా బంద్ చేస్తారన్నారు.

సంగారెడ్డి జిల్లాకు రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజీ రూ. 40కోట్లతో నర్సింగ్ కాలేజీ, రూ. 24 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్‌ను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, తెలంగాణ చేనేత కార్పొరేషన చైర్మన్ చింత ప్రభాకర్, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతి, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మెన్ బొంగుల విజయలక్ష్మి, డిసిఎంఎస్ చైర్మెన్ శివకుమార్, డిసిసిబి వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం, జడ్‌పిటిసి సునీత మనోహర్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, ఎంపిపి సరళ పుల్లారెడ్డి, యాదమ్మ, సిడిసి చైర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు డాక్టర్ శ్రీహరి, కొండల్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News