హైదరాబాద్: 2007 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం ఉదయం నగరంలోని బంజారాహిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15 నుంచి 18 ఏండ్ల వయసున్న పిల్లలు మొత్తం 18 లక్షల 70 వేల మంది వరకు ఉన్నారని, వీరందరికి త్వరితగతిన వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా 1,014 వ్యాక్సినేషన్ సెంటర్లు ప్రారంభించామని.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, డాక్టర్ల సమక్షంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, తెలిపారు. హైదరాబాద్‌తో పాటు 12 కార్పొరేషన్లలో పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే టీకా వేయించుకోవాలని చెప్పారు. ఇతర పట్టణాలు, మండలాల్లో నేరుగా వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం కల్పించామన్నారు. పిల్లలకు విధిగా వ్యాక్సిన్ ఇప్పించాలని తల్లిదండ్రులను మంత్రి కోరారు.
Harish Rao begins vaccination for 15 to 18 age group