హైదరాబాద్: తాను రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు వచ్చానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా లేఖతో రావాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గన్‌పార్క్ వద్దకు చేరుకొని మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ అమలుపై రేవంత్ రెడ్డి దేవుళ్లపై దొంగ ఒట్టు వేస్తున్నారని చురకలంటించారు. రేవంత్ ఒట్లు నిజమైతే గన్‌పార్క్‌కు రావాలని చాలెంజ్ చేశారు. స్పీకర్ పార్మాట్‌లోనే రాజీనామా లేఖ తీసుకొచ్చానని, రేవంత్ రెడ్డి తన సిబ్బందితోనైనా రాజీనామా లేఖను పంపించాలని డిమాండ్ చేశారు. మాకు రాజకీయాల కంటే పేదల ప్రయోజనమే ముఖ్యమన్నారు. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.
ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తే బిఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా? అని సిఎం రేవంత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆగష్టు 15 లోపు రైతు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే తాను రాజీనామా చేయడానికి అమరవీరుల స్థూపం వద్దకు వస్తానని, సిఎం రేవంత్ రెడ్డి కూడా రావాలని మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీష్ రావు ప్రతి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.