హైదరాబాద్: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే వాటిని రద్దు చేయాలనే బిజెపి నాయకులు ఆలోచన చేస్తున్నారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బిజెపి నాయకులు భవిష్యత్తు లో ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట అర్బన్ బిజెవైఎం అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బిజెపి విధానాలు, వారి ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ బిజెపి నుంచి టిఆర్ఎస్ లోకి వస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట పురటిగడ్డ అని, అలాంటి సిద్దిపేటోళ్లు తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయారని, దెబ్బలు కూడా తిన్నారని, ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటామని స్పష్టం చేశారు.
ఎవ్వరూ చూసినా సిద్దిపేటను అభివృద్ధి చేసుకుంటున్నారని మాట్లాడుతున్నారని బిజెపి కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక ఈర్ష్య తో బిజెపి నాయకులు సోషల్ మీడియాలలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటికి ప్రజలకు చేసింది ఏమి లేదని, వాతలు కోతలు తప్ప సాధించింది సున్న అని హరీష్ రావు మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను ఉడగొట్టడమే కాకుండా ,కేంద్రం ఒక్క ఉద్యొగం ఇచ్చింది లేదన్నారు. రైతుల ఉసురు పోసుకునేలా విద్యుత్ సంస్కరణలకు తీసుకరావడానికి రాష్ట్రాలపై కేంద్రం వత్తిడి చేస్తుందని దుయ్యబట్టారు. ఉచిత పథకాలు వద్దంటున్న బిజెపిని తెలంగాణ ప్రజలు రద్దు చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. బిజెపి కల్లబొల్లి మాటలను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే, కేంద్రం మోకాలడ్డు వేస్తుందని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి తీరును ప్రజలు గమనిస్తున్నారని తగిన గుణపాఠం తప్పదన్నారు.. జిఎస్టీ పేరిట అన్ని వర్గాలకు భారం మోపిన బిజెపి నాయకులను ప్రజలు గ్రామాల్లో నిలదీయాలన్నారు.