కోర్టుల్లో స్టేలు తెచ్చేందుకు కుయత్నాలు
317 యథావిధిగా అమలు
చేస్తున్నాం మధ్యప్రదేశ్ సిఎం రైతు
హంతకుడు.. ముఖ్యమంత్రి కెసిఆర్
రైతు బాంధవుడు ఎన్‌టిఆర్ స్టేడియంలో
ఘనంగా రైతుబంధు ఉత్సవాలు
బిజెపిపై మంత్రి హరీశ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ఇచ్చిన 317 జీవోను టిఆర్‌ఎస్ ప్రభుత్వం యథావిధిగా అమలు చేస్తోందని, అయినా బిజెపి నాయకులు అడుగడుగునా అడ్డుపుల్ల వేసేందుకు యత్ని స్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోను అమ లు చేసి ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాని భర్తీ చేయాలని ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రతి క్షణం తపనపడుతున్నారన్నా రు. కానీ ఉద్యోగాలు భర్తీ చేయనీయకుండా ఉండేందుకు అన్ని రకాలు ప్రయత్నాలు బిజెపి నేతలు చేస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు. కోర్టుల్లో స్టేలు తెచ్చేందుకు యత్నించడం శోచనీయమన్నారు. నిరుద్యోగుల పట్ల ఆ పార్టీ నేతలకు ఉన్న ప్రేమ ఇదేనా? అని ఆయన మండిపడ్డారు.
కేంద్రం ఎలాగో ఉద్యోగాలు ఇవ్వడం లేదు…కనీసం రాష్ట్ర ప్రభుత్వమైన కొలువులు ఇస్తుంటే, అందుకు సంతోషపడాల్సిన బిజెపి నాయకులు ఈర్షతో రగిలిపోతున్నారని విమర్శించారు. ప్రతి విషయాన్ని రాజకీయ మైలేజీ కోసం యత్నించే పార్టీ… బిజెపి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తూ, బిజెపి నేతలను చూస్తుంటే రాష్ట్రంలో 317 జీవో అమలు కావద్దు… ఉద్యోగులు భర్తీ కావద్దు అన్న చందంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే కెసిఆర్ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు విడుపోతున్న నేపథ్యంలో తెలంగాణ వాళ్లకు స్థానికంగానే ఉద్యోగాలు ఉండాలన్నారు. అలా ఇవ్వడం సాధ్యం కాదని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారన్నారు.
రాష్ట్రాల విభజన గతంలో జరిగినట్లుగానే చేస్తామన్నారు. అంతే తప్ప తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిబంధనలను అమలు చేయబోమన్నారు. స్థానికులకు స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వమన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి…తదనుగుణంగా ఉత్తర్వులు సాధించారన్నారు. రాష్ట్రపతి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చిన విధంగానే జీవోను అమలు చేస్తున్నామన్నారు. ఈ ఉత్తర్వులను కూడా బిజెపి అమలు చేయవద్దని చెప్పడం అత్యంత దారుణమన్నారు. రాజకీయ లబ్ధికోసం బిజెపి అలా మాట్లాడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో లక్షా 39 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినంచ జీతాలు ఇవ్వడంలేదన్నారు. కరోనా కష్టకాలంలో పిఆర్‌సి 30 శాతం ఇచ్చిన ప్రభుత్వం తమదన్నారు. రాష్ట్రం లో ఉద్యోగుల సమస్య తేలకుండా, ఉద్యోగాలు భర్తీ కాకుండా చేయాలనేది ఆ పార్టీ కుట్రగా కనిపిస్తోందని ఆరోపిం చారు. రైతుబంధు కింద రైతులకు పదివేల రూపాయలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం ఉందా? అని నిలదీశారు. రైతులంటే బిజెపికి చాలా చిన్నచూపన్నారు. అందుకే రైతుల బావి దగ్గర మీటర్లు పెట్టి కరెంటు బిల్లులు వసూలు చేయమంటోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏడేళ్లలో టిఆర్ ఎస్ ప్రభుత్వం రెండు లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతులు ఆదుకోమని వస్తే మధ్యప్రదేశ్ సిఎం ఆ రాష్ట్రంలోని రైతులను పిట్టల్లా కాల్చి చంపారన్నారు. ఆయన రైతు హంతకుడిగా పేరు పొందుతే.. కెసిఆర్ రైతు బాంధువుడిగా నిలిచారన్నారు.
రైతుబంధు గొప్ప పథకం
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు ఒక గొప్ప పథకమన్నారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతుబంధు నిధులు అందిస్తోందని వెల్లడించారు. ఏ పార్టీ అని చూడకుండా అందరికి ప్రభుత్వం రైతుబంధు అందిస్తోందని తెలిపారు. కానీ కొంత మంది రైతులు ఉచితంగా ఎరువులు ఇవ్వా లని కోరుతున్నారని.. ఈ రైతుబంధు ఇచ్చేది పెట్టుబడి కోసమేనని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు, కార్పొరేటర్లు, స్థానిక టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.