Tuesday, January 14, 2025

కూలీలకు రూ.12 వేలు ఆత్మీయ భరోసా ఇవ్వాలి:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

ఉపాధి హామీ కూలీలకు ఆత్మీయ భరోసా పేరుతో మోసం చేసేందుకు సిఎం రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆరోపించారు. సంగారెడ్డిలో సోమవారం ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది ఉపాధి కూలీలున్నారని, వారంతా మట్టి పని చేస్తున్నారని చెప్పారు. అయితే ఒక సెంటు భూమి ఉన్నా..వారికి ఆత్మీయ భరోసా ఇవ్వబోమంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పడం దారుణమన్నారు. దళిత, గిరిజన పేద రైతులను కూడా మోసం చేయాల్సిందేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 24.70 లక్షల మందికి ఎకరం కంటే తక్కువ భూమి ఉందని, వారికి ఆత్మీయ భరోసా ఏడాదికి రూ.12 వేలు ఇవ్వకుండా చేసేందుకు నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు. రక రకాల కారణాలు చెప్పి, పేదల కడుపు కొట్టడం తగునా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అనేక మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చారని,

ఇప్పుడు అన్ని పథకాల అమలులో కోతలు పెడుతున్నారని, హామీలు అమలు చేయడం చేతకాకుంటే, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎం ఇచ్చిన చెక్కుకే విలువ లేకుంటే, ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి ఏమి గౌరవం ఉన్నట్టని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గత నవంబర్ 30వ తేదీన మహబూబ్‌నగర్‌లో ఇచ్చిన చెక్కు డమ్మీ అనుకోవాలా? లేకుంటే, మోసం చేయడం కాంగ్రెస్‌కు, సిఎంకు అలవాటుగా మారిందని అనుకోవాలా? అని ప్రశ్నించారు. రెండు నెలలు కావస్తున్నా రైతుకు ఇచ్చిన చెక్కు పాస్ కావడం లేదంటే, ఇంతకంటే మోసం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో అధికారులది తప్పు అయితే, వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే, సిఎం తన చేతగానితనాన్ని అంగీకరించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, రైతు బీమా, తాజాగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు రుణమాఫీ…ఈ విధంగా అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం రైతులను వరుసగా మోసగిస్తోందని ఆరోపించారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, సగం పంటలకే బోనస్ ఇచ్చారని గుర్తు చేశారు.

భట్టి సిద్ధమేనా…?
బిఆర్‌ఎస్ పాలనలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదంటూ…ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో ఆరోపించడం తగదన్నారు. కెసిఆర్ పాలనలో చేసిన అప్పులపై తడవకో తీరుగా భట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తమ ప్రభుత్వ హయాంలో నాలుగున్నర వేల కోట్లతో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని గుర్తు చేశారు. దీనిపై ఎక్కడికి రమ్మంటే అక్కడికి తాను వస్తానని, ఇందుకు భట్టి సిద్దమేనా అని సవాల్ విసిరారు. గోబెల్స్ ప్రచారాన్ని మానుకోకుంటే, ప్రజల్లో ప్రభుత్వమే చులకన అవుతుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైనా ప్రజలను మోసగించడమే రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎ మాణిక్‌రావు, డిసిఎంఎస్ ఛైర్మన్ మల్కాపురం శివకుమార్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మఠం బిక్షపతి, పార్టీ సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డి, హకీం,విజేందర్‌రెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News