Monday, February 24, 2025

నదీజలాలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర

- Advertisement -
- Advertisement -

బనకచర్లపై ఏపీ
దూసుకెళ్తుంటే సీఎం
రేవంత్ ఏం చేస్తున్నారు?
గోదావరి నీళ్లను పెన్నాకు
తరలించేందుకు
ఏపీ ప్రయత్నాలు
దావోస్ టూర్‌కు సీఎం
దారి ఖర్చులు వృథా
ప్రభుత్వంపై బీఆర్‌ఎస్
అగ్రనేత హరీశ్‌రావు ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎపి ప్రభుత్వం ముందుకెళ్తుంటే తెలంగాణ సిఎం, నీటిపారుదలశాఖ మం త్రి ఏం చేస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ప్రశ్నించారు. బనకచర్లపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీ ళ్లు, నిధులు, నియామకాల కోసం అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సా గునీటి విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలు ఎ ర్రోళ్ల శ్రీనివాస్, దూదిమెట్ల బాల్‌రాజు, విజయ్‌కుమార్ తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, గోదావరి నీళ్లను పెన్నాకు తీసుకెళ్లేందుకు ఏపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. గోదావరి నీళ్లను ఏపీకి తీసుకెళ్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? ప్రశ్నించా రు. బనకచర్ల ఆపాలని సిఎం రేవంత్ రెడ్డి కనీసం లేఖ కూడా రాయలేదని అన్నారు. నాలుగు ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రాజెక్టులకు అనుమతుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బనకచర్లకు నిధుల కోసం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని, చంద్రబాబు లేఖపై కేంద్రంలో దస్త్రం కదులుతోందని తెలిపారు. చంద్రబాబు నవంబర్‌లో లేఖ రాస్తే సిఎం రేవంత్ ఏం చేశారని అడిగారు.

బనకచర్లపై ఎపి ముందుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు..? ప్రశ్నించారు. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. కృష్ణా జలాల విషయంలో సెక్షన్ 3ని సాధించిందే కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇప్పుడు సెక్షన్ 3పై ఎపి సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఎపి సుప్రీంకోర్టుకు వెళ్తే కనీసం కేవియట్ వేయరా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అధికారులు సరిగ్గా మార్గదర్శకత్వం చేయట్లేదని, మంచి న్యాయవాదులను పెట్టి సెక్షన్ 3 విషయంలో వాదించాలి కదా..? అని పేర్కొన్నారు. సాగునీటి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని, మేడిగడ్డను పండబెట్టారు.. పాలమూరును పక్కకు పెట్టారని విమర్శించారు. ఇప్పటికైనా నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని సూచించారు. అఖిలపక్షం వేస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎపి మాజీ సీఎస్ ఆదిత్యానాథ్‌ను సలహాదారుగా పెట్టుకున్నారని, ఆదిత్యనాథ్ విషయంలో రేవంత్ గురుదక్షిణ చెల్లించారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తుంగభద్రను గండికొట్టేందుకు ఎపి, కర్ణాటక యత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఎపి, కర్ణాటక తుంగభద్రకు గండి కొడుతుంటే సిఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. 2017లో ఎపి ఇలాంటి ప్రయత్నం చేస్తే గట్టిగా అడ్డుకున్నామని హరీష్‌రావు గుర్తు చేశారు.

మెగా కృష్ణారెడ్డి కంపెనీతో ఒప్పందానికి దావోస్ వెళ్ళాలా..?
మెగా కృష్ణారెడ్డి కంపెనీతో ఒప్పందానికి దావోస్ వెళ్ళాలా..? అంటూ సిఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు చురకలంటించారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డుకు అటు వైపు సిఎం రేవంత్ రెడ్డి ఉంటారు…ఇటు వైపు మెగా కృష్ణారెడ్డి ఉంటారని వివరించారు. దావోస్ టూర్‌కు సిఎం రేవంత్ రెడ్డి దారి ఖర్చులు వృధా చేశారని మండిపడ్డారు.

22 డేట్‌తో లెటర్ రాసి శుక్రవారం విడుదల
తాను పత్రికా సమావేశం పెట్టిన తర్వాతనైనా మేల్కొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్నటి డేట్ (జనవరి 22, 2025)తో లెటర్ రాసి, శుక్రవారం విడుదల చేసినందుకు మాజీ మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు. జనవరి 22వ తేదీనే నిజంగా లేఖ రాసి ఉంటే, ఆ రోజే మంత్రి మీడియాకు ఇచ్చి ఉండే వారు కదా..? ఈరోజు వరకు దాచిపెట్టరు కదా..? అని అడిగారు. గోదావరి, కృష్ణా, పెన్నా లింకింగ్ విషయంలో ఎపి ముఖ్యమంత్రి 2024 నవంబర్ 15.న లేఖ రాస్తే, దాని నిధుల కొరకు 2024 డిసెంబర్ 31న మరొక లేఖ రాస్తే, మీరు ఈరోజు వరకు ఎందుకు స్పందించలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. ఉత్తరాలు ఎందుకు రాయలేదు, ఎందుకు ఆ ఉత్తరాలను విడుదల చేయలేదని ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తన వ్యాఖ్యలను మంత్రి వక్రీకరించడం శోచనీయమని పేర్కొన్నారు. తాను 200 టిఎంసిల తీసుకుపోతున్నారని ఎక్కడ అన్నాను అని, తీసుకుపోయేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేస్తుంటే మీరు మౌనం వహిస్తున్నారని తప్పుబట్టానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

ప్రశ్నిస్తే గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు
తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం తాను ప్రశ్నిస్తే గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. 512 నుంచి -299 ఒప్పందం అనేది ఒకే ఏడాదికి అని మీరు విడుదల చేసిన డాక్యుమెంట్లలోనే స్పష్టంగా ఉందని, మంత్రి హోదాలో ఉండి ఎందుకు అబద్దాలు చెబుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నంచారు. ఒకవేళ 512 నుంచి -299 ఒప్పందం ఉండి ఉంటే, సెక్షన్ 3 ప్రకారం, నీటి పంపకాలు అనే విషయం ఎందుకు ఉత్పన్నమైతదని అడిగారు. సెక్షన్ 3 కోసం బిఆర్‌ఎస్ ఎందుకు పట్టుబట్టిందని, ట్రిబ్యునల్ సమావేశానికి మంత్రి హోదాలో హాజరైన మొదటి వ్యక్తి తానొక్కడినే అని మరో అబద్దం చెబుతున్నారని పేర్కొన్నారు.

2016లోనే ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్, ఇరిగేషన్ మంత్రిగా తాను ట్రిబ్యునల్ మీటింగ్‌లో పాల్గొని తెలంగాణ పక్షాన కొట్లాడామని, మీటింగ్ మినట్స్‌లో ఉంటది చూసుకోవాలని సూచించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనూ నోటికి వచ్చిన అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదనేది పచ్చి అబద్దం అని, ఇదే అబద్దాన్ని పదే పదే చెబుతున్నారని పేర్కొన్నారు. ఎపి సిఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే వ్యతిరేకిస్తూ పుంఖానుపుంఖాలుగా లేఖలు రాసాశామని గుర్తు చేశారు. తాను మాట్లాడింది గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం గురించి అయితే, ఆ విషయం మాట్లాడకుండా ఏవోవో మాట్లాడి, డైవర్ట్ చేసే ప్రయత్నం చేసారని అన్నారు. మంత్రి చెప్పిన అబద్దాలకు పూర్తి వాస్తవాలతో పత్రికా సమావేశం నిర్వహించి, అబద్దపు ప్రచారాన్ని పటాపంచలు చేస్తానని ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News