సిద్దిపేట: దరఖాస్తుల పేరుతో ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు? ప్రజల డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారి 30, 40 రూపాయలు ఖర్చు అవుతుందని, ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాం, మీ సేవలో అప్లికేషన్ పెట్టాం, ఇప్పుడు మళ్లీ గ్రామసభల్లో అప్లికేషన్ పెట్టుకున్నామని ప్రజలు అంటున్నారని, ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్ లైన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆన్ లైన్ దరఖాస్తులు కట్టగట్టి పక్కకు పడేయడం వల్ల మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. సిద్దిపేట పట్టణం గాడిచర్లపల్లి 15వ వార్డ్ లో నిర్వహించిన గ్రామ సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారని, ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నం పెడుతామన్నారని, ఇప్పుడు అందరికీ పంగనామాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం చెప్పాలని హరీష్ రావు నిలదీశారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఎగవేతల సిఎం రేవంత్ రెడ్డి, కోతల రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోతలు ఎన్నికల తర్వాత ఎగవేతలు అని చురకలంటించారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే యాసంగి వానకాలానికి కలిపి రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదికి ఐదు లక్షల ఇల్లు కడతామని హామీ ఇచ్చారని, ఏడాది పూర్తయిందని ఒక్క ఇల్లయిన ప్రభుత్వం కట్టిందా? అని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిన ఇల్లులే తప్ప కట్టిన ఇళ్ళు లేవని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సి, ఎస్టిలకు ఇల్లు కట్టుకునేందుకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కోటిమంది కూలీలు ఉంటే కోతలు పెట్టి ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం సరికాదన్నారు. ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల రూపాయలు బాకీ పడిందని, 13 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? అని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా వానకాలం, యాసంగికి కలిపి 15వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామని, వ్యవసాయ కూలీలందరికీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలన్నారు.