కోతలు, వాతలు లేకుండా రైతులు పండించిన
ప్రతి పంటను కొనుగోలు చేయాలి
సన్నాలకు బోనస్ బోగస్
రాష్ట్రవ్యాప్తంగా పొద్దు తిరుగుడు కొనుగోలు
కేంద్రాలను ప్రారంభించాలి
ఎంఎల్‌ఎ హరీశ్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: బిఆర్‌ఎస్‌ది అసలు పాలన అయితే కాంగ్రెస్‌ది కొసరు పాలన అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను తుంగలో తొక్కి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మండిపడ్డారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికల అనంతరం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి మాటా మార్చారని గుర్తు చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ 48 గంటల లోపు సన్నవడ్ల బోనస్ డబ్బులను జమ చేస్తామని గొప్పగా చెప్పి 48 రోజులు గడుస్తున్నా ఆ డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయలేదన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.432 కోట్ల సన్న వడ్ల డబ్బులను రైతులకు బాకీ పడిందన్నారు.
బోనస్ డబ్బుల కోసం రైతులు కలెక్టర్ల, వ్యవసాయ శాఖ అధికారుల చుట్ట్టూ తిరుగుతున్నారని అన్నారు. రైతు బం ధు సైతం ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇచ్చే రూ.6 వేలు సైతం సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. రైతుబంధుతో పాటు రుణమాఫీ, బోనస్ డబ్బులు లాంటి అనేక కాం గ్రెస్ అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందన్నారు. కంది రైతులపై సర్కార్ పగపట్టిందని, రైతులు పండించిన కంది పంట మూడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతులు పండించిన కంది పంట మొత్తం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాని డిమాండ్ చేశారు. క్రాప్ బుకింగ్‌లో పేర్లు తప్పిపోయిన రైతులకు సైతం అనుమతి ఇవ్వాలన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు చేసిన తప్పులకు రైతులను బలి చేయవద్దని సూచించారు. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి కొనుగోలు చేయాలన్నారు. ఆయిల్ పామ్ పంటలను ప్రోత్సహించి రైతులు పండించిన పంటలను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. కాంగ్రెస్ అంటేనే కోతల ప్రభుత్వమని తెలిపోయిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో అసంతృప్తిగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తగిన గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలతో పాటు పంటలకు మద్దతు ధర అందించాలని ముఖ్యమంత్రికి తాను రాసిన లేఖను విలేఖరుల ఎదుట ప్రదర్శించారు. విలేకరుల సమావేశంలో ఎంఎల్‌ఎసి యాదవరెడ్డి, పార్టీ నాయకులు కడవేర్గు రాజనర్సు, కొండం సంపత్‌రెడ్డి, పూజల వెంకటేశ్వర్‌రావు ఉన్నారు.