Sunday, January 19, 2025

మనకు నీళ్లు వస్తే కాంగ్రెసోళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి సభ పెట్టడం అంటే హుస్నాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హుస్నాబాద్ లో హరీష్ రావు పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో మొదటి సభ నిర్వహించామని, అదేవిధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని, హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మీ కటాక్ష నియోజకవర్గం అని, మంచి జరగుతుంది అని ఇక్కడ నిర్వహిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.

హుస్నాబాద్ పట్టణంలో సబ్ స్టేషన్ వెనకాల ఉన్న ప్రదేశంలో సభ నిర్ణయించారని, ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని, కనీసం టికెట్లు ఇచ్చుకొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని, కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో ఎక్కువ గల్లీలో తక్కువ వయా బెంగళూరు అంటూ కబర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మతకల్లోలాకు పెట్టింది పేరైన కాంగ్రెస్ మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు.

అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు హుస్నాబాద్ లో జరిగాయని, 8 టిఎంసిలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని, నీళ్లు వస్తే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుందని ఎద్దేవా చేశారు. హుష్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ బాబు ఉండటం తమ అందరి అదృష్టమని, 15వ తేదీ మేనిఫెస్టో విడుదల తర్వాత నిర్వహించే మొదటి సభ హుస్నాబాద్ లో జరుగుతుందని, కెసిఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయంగా కనిపిస్తోందని, 2014, 18లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతందని, పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని కాంగ్రెస్ పార్టీ చూసిందని, 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్న టిఆర్ఎస్ పార్టీని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

మూడు గంటలు కరెంటు రైతులకు సరిపోతుంది అన్న కాంగ్రెస్ కావాలా రైతుల మోటర్లకు మీటర్లు పెడుతున్న బిజెపి కావాల్నా, మూడు పంటలకు సరిపడా కరెంటు ఇస్తున్న కెసిఆర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎందుకు బిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభివృద్ధి చేయలేదని అడిగారు. ముఠా రాజకీయాలతో ఢిల్లీలో టికెట్ ల పంచాయితీ నడుస్తుందని, బిఆర్ఎస్ టికెట్ ప్రకటించి 50 రోజులైనా ఇప్పటికీ కాంగ్రెస్ టికెట్లు ప్రకటించుకోలేదని హరీష్ రావు చురకలంటించారు.

సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఒకటి కాదు అనేక పథకాలకు దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కేంద్రమే మన పథకాలు కాపీ కొట్టింది అంటే మనం ఆదర్శమా కాదా? అని ప్రజలను అడిగారు. మూడో సారి కెసిఆర్ విజయం పక్క అని, కెసిఆర్ మొదటి సభ విజయవంతం చేయాలని, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, పండుగ వాతావరణంలో ఈ సభను విజయవంతం చేసి కెసిఆర్ కు ఘనంగా స్వాగతం పలకాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఈ సభకు వస్తారు అందరినీ ఆహ్వానించాలన్నారు. ప్రణాళికతో జాగ్రత్తగా ప్రజలకు ఇబ్బంది లేకుండా సభా స్థలానికి చేరుకునే విధంగా స్థానిక నాయకులు చూడాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News