Monday, January 20, 2025

విజయోత్సవాలు కాదు… అపజయోత్సవాలు జరపండి: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్‌గా
మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా
అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ పార్టీ, సిఎం రేవంత్ రెడ్డిపై
మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు సక్సెస్ ఫుల్‌గా ప్రజల్ని మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలని మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్ రావు విమర్శించారు. కెసిఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారని, పది నెలల రేవంత్ పాలనలో అందరి కడుపు కొట్టారని ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు..

‘ఎవరనుకున్నారు ఇట్లవున్నానని.. ఎవరునుకున్నారు ఇట్లవున్నానని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారు.. రైతులు దారుణంగా మోసపోయారని హరీశ్‌రావు విమర్శించారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఏం సాధించారని సంబురాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి..? అని సిఎంను ప్రశ్నించారుజ ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు ఏడాది అయినా అతీగతీ లేదని, డిక్లరేషన్‌లో చెప్పిన మొట్ట మొదటి హామీ రూ. 2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదని అన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదు.. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తాన్న రూ.12 వేలు ఇవ్వనేలేదు… పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారని పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని, ఇందుకేనా వరంగల్ విజయోత్సవ సభ..? అని నిలదీశారరు. కాంగ్రెస్ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేళ్ల వెనక్కి వెళ్లిందని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

నేడు తిరోగమనంలో తెలంగాణ..

‘కెసిఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి నెలకొందని అన్నారు. వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పాటలు పాడుకుంటున్న పరిస్థితి అని పేర్కొన్నారు. పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు, స్కాలర్ షిప్పుల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, రుణమాఫీ, రైతుబంధు కోసం రైతన్నలు, జీతాల కోసం ఆశాలు, అంగన్‌వాడీలు, డిఎ, పిఆర్‌సి కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది, ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు, ఇళ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు, సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు, పింఛన్లు పెంచాలంటూ వృద్ధులు, బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్‌గా రోడ్ల మీదకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటే, పది నెలల పాలనలో రేవంత్‌రెడ్డి అందరి కడుపు కొట్టారని, నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచారని హరీశ్‌రావు అన్నారు.

ఇప్పటికైనా కళ్లు తెరవండి..

కాంగ్రెస్ జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, సక్సెస్ ఫుల్‌గా ప్రజల్ని మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏడాది కావొస్తుంది… ఇప్పటికైనా కళ్లు తెరవండని అన్నారు. అద్భాతాలు చేశామనే భ్రమ నుంచి బయటపడి ఇచ్చిన హామీలు అమలు చేయండి… గోబెల్స్ ప్రచారాలు పక్కన బెట్టి పరిపాలన మీద దృష్టి సారించండి అని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి మోసం చేసినందుకు వరంగల్ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. మాట ఇచ్చాం, పూర్తి చేశామని మహిళలకు ఇచ్చిన హామీల పట్ల కోట్లు వెచ్చించి ప్రకటనలు జారీ చేసినంత మాత్రాన అబద్దాలు నిజమైపోవు అని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీగా మహిళలకు చెప్పిన రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారో, కల్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో, స్వయం సహాయక సంఘాలకు షరతులు లేకుండా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలి, తేదీలు ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News