ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ వరకు వస్తే, ఆశలు అడియాసలవుతున్నాయని, పడ్డ శ్రమ వృథా అవుతున్నదని ప్రజలు వాపోతున్నారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టారని, ఆ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను జరపకపోగా పేరు మార్చి ప్రజావాణిని చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కేవలం ఒకే ఒక్కరోజు హాజరై, 10 నిమిషాల పాటు మాత్రమే ప్రజల నుంచి వినతులు స్వీకరించారని గుర్తు చేశారు. దీన్నిబట్టి ప్రజా దర్బార్ పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైపోయిందని ఎద్దేవా చేశారు. ఆర్.టి.ఐ. యాక్టు ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. కొండంత ఆశలు రేపి, గోరంత కూడా న్యాయం చేయక గోళ్లు గిల్లుకుంటున్నారని విమర్శించారు. మొత్తం మీద సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారిందని, ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయిందని అన్నారు.
మొదటి హామీ నీటి మీది రాతగా మిగిలిపోయింది : మేనిఫెస్టోలోని మొదటి హామీ నీటి మీది రాతగా మిగిలిపోయిందని విమర్శించారు. మంత్రులు అందుబాటులో ఉంటారని మాట మార్చారు.. ఆ మాటా నిలబెట్టుకోలేదని చెప్పారు. మంత్రులకు గాంధీభవన్‌కు వెళ్లేందుకు ఉన్న తీరిక, ప్రజావాణికి రావడానికి మాత్రం ఉండటం లేదని ఆరోపించారు. దీంతో ప్రజావాణి పట్ల మంత్రుల చిత్తశుద్ధి ఏపాటిదో కూడా తేటతెల్లమైపోయిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రీ రాక, మంత్రులూ రాక, చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతినిత్యం నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొని, కడహీనంగా వారానికి రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఆ రెండు రోజుల ప్రజావాణికి రావడం, దరఖాస్తులు సమర్పించుకోవడం ఉత్త వృథా ప్రయాసే అవుతున్నదని జనం వాపోతున్నారని పేర్కొన్నారు. ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82 వేల 955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే, అందులో కేవలం 43 వేల 272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ కిందకు వస్తాయని మిగతావి గ్రీవెన్సెస్ పరిధిలోకి రావంటున్నారని చెప్పారు. ఫిర్యాదు, అన్యాయం, హక్కులకు భంగం, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, అధికారులు వారి విధులు నిర్వహించకపోవడం, ప్రజలకు సిటిజన్ చార్టర్ ప్రకారం అందవలసిన సదుపాయాలు అందకపోవడం… వీటినే గ్రీవెన్సెస్ కింద పరిగణిస్తామని అధికారులు గ్రీవెన్సెస్కు నిర్వచనం ఇచ్చారని అన్నారు. ఈ నిర్వచనం ప్రకారం భూ తగాదాలు గానీ, భూ నిర్వాసితుల సమస్యలు గానీ, నిరుద్యోగుల సమస్యలు గానీ, వివిధ వర్గాల పేదరిక సంబంధ సమస్యలు గానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలైన విషయాలు గ్రీవెన్సెస్ కిందకు రావంటూ సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించేశారని తెలిపారు. గ్రీవెన్స్ పరిధిలోకి రావని 50 శాతం ప్రజావాణి పిటిషన్లను అధికారులు తిరస్కరించినట్లు ఆర్.టి.ఐ. కింద ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడైందని అన్నారు. ప్రజావాణికి వచ్చిన మొత్తం 82 వేల 955 పిటిషన్లలో..
గ్రీవెన్సెస్గా గుర్తించినవి 43 వేల 272 మాత్రమే అని, వీటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారని పేర్కొన్నారు. అలా పంపిన 43,272 గ్రెవెన్సులలో 27,215 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయని చెబుతున్నారని, అయితే, 27,215 గ్రీవెన్సులు పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అది నిజం కాదని తెలిపారు. చాలా సమస్యలను పరిష్కరించకుండానే ఫైళ్లను క్లోజ్ చేశారని క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని వెల్లడించారు. సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఫైల్ క్లోజ్ చేశారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్‌రావు తెలిపారు.