రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ళు నిలిచిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారడం శోచనీయమని పేర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధరకు కూడా అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని విమర్శించారు. సిసిఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. పత్తి రైతులు రోడ్లెక్కి లబోదిబోమంటుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా..? అని ప్రశ్నించారు.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అలసత్వం, సమన్వయ లోపంతో పత్తి రైతులు చిత్తవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఫోటోలకు ఫోజులిచ్చిన మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. పంట చేతికి వచ్చిన ఈ సమయంలో రైతుల జీవితాలతో చెలగాటమాడటం ఏమిటి..?..మిల్లుల వద్దకు చేరిన పత్తి లారీల లోడ్లతో రైతులు ఎన్ని రోజులు ఎదురుచూడాలి..? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల సమస్యలు పట్టించుకునే సమయం లేదా..? తేమ శాతం సడలింపు, కొత్త నిబంధనల విషయమై ఢిల్లీకి వెళ్లి సిసిఐ అధికారులకు విజ్ఞప్తి చేసే తీరిక లేదా..? అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొద్దునిద్ర వీడి తేమ శాతం సహా ఇతర నిబంధనల విషయంలో కేంద్రంపై, ఒత్తిడి తేవాలని, అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగేలా చూడాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.