పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు, నంగునూర్ మండలాల్లో వడగండ్ల వానతో నష్టం జరిగిన పంట పొలాలను ఆయన శనివారం పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ నిజంగా పంటల బీమా చేసి ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేదని అన్నారు. పంటల బీమా చేస్తామని బడ్జెట్‌లో నిధులు కేటాయించి సర్కార్ మొండిచేయి చూపిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆందోళన చెందుతున్న రైతులకు కాంగ్రెస్ కనీసం భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు.
ఇప్పటివరకు రైతులకు 40 శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని, 60 శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. రైతుబంధు కూడా సగం మంది రైతలకు అందలేదన్నారు . వానాకాలం రూ.9 వేల కోట్లు, ఈ యాసంగికి రూ.5 వేల కోట్లు మొత్తం కలిపితే రూ.14 వేల కోట్ల రైతు బంధును రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని ఆరోపించారు. గత ఎండాకాలంలో పడ్డ వడగండ్ల వానకు సిద్దిపేట నియోజకవర్గంలో 1,350 ఎకరాల్లో పంట నష్టం జరిగితే నేటివరకు ఆ డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఇటీవల కురిసిన వడగండ్లతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా వేశామని అన్నారు.
రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలతో అధికారులు బలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వ అధికారులు బలయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌సియూలో 400 వందల ఎకరాల్లో చెట్లను నరకడానికి కారణం రేవంత్‌రెడ్డేనని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. రామయ్యతో పాటు ఆయన సతీమణి అడవుల పెంపకం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులని కొనియాడారు. చెట్లు పెట్టడం రామయ్య వంతు అయితే చెట్లను నరకడం సిఎం రేవంత్ రెడ్డి వంతని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి రామయ్య మృతికి సంతాపం తెలపడమంటే హంతకుడే సంతాపం తెలుపుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. గతంలో చెట్లను నరకడానికి కారాణమైన అధికారుల ఉద్యోగాలు పోయి జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు రాధాకృష్ణ శర్మ, మాణిక్యారెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కనకయ్య తదితరులు ఉన్నారు.